పల్లెల్లో మిన్నంటిన దాహాకారాలు | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో మిన్నంటిన దాహాకారాలు

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలోని రాయచూరు, అత్తనూరు, కల్మల, అమీన్‌గడ, దేవదుర్గ, సిరవార, మస్కి, మాన్వి, లింగసూగూరు, కల్లూరు, ఇడపనూరు, తలమారి, బూడిదపాడు, అత్కూరు, సగంకుంట, హట్టి కవితాళ, చించరికి, నవలకల్‌, నీలగల్‌ గుంజహళ్లి, సింగనోడి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి విశ్వరూపం దాల్చింది. తుంగభద్ర ఎడమ కాలువలో నీరు బంద్‌ కావడంతో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సమస్య ఉల్బణమైంది. తాగునీరు అందించండి మహాప్రభో అంటూ పట్టణ, గ్రామీణ ప్రజలు గ్రామ, తాలూకా, జిల్లా పంచాయతీ కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు, నిరసనలు చేసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. చిన్న నీటి పారుదల పథకాల కింద మినీ ట్యాంకులను నిర్మించినా అవి అర్దాంతరంగా ఆగిపోయాయి.

700 గ్రామాల్లో నీటి ఎద్దడి

జిల్లాలో 700 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ప్రజలు చెరువులు, కుంటలు, బోరుబావుల మీద ఆధారపడినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. సిరవార తాలూకా అత్తనూరులో తాగునీటి కోసం 2 కి.మీ. దూరంలో సోమవారపేటె మఠం నిర్మించిన చెరువు నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. అత్తనూరుకు అమ్మాయి ని ఇవ్వాలంటే గ్రామంలో తాగునీరు ఉందా? అని అడిగి అబ్బాయికి అమ్మాయిని ఇస్తున్నారు. అత్తనూరుకు నేను రాను బిడ్డో.. అని వారిస్తూ అమ్మాయిలు వివాహానికి వెనుకడుగు వేస్తున్నారు. అధికారులు మేల్కొని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి శాశ్వత నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కృష్ణమ్మ వెలవెల.. చేపలు విలవిల

ప్రతి ఏటా కృష్ణా నదిలో ఎంతో కొంత నీరు నిల్వ ఉండేది. మత్స్యకారులు చేపలను వేటాడి విక్రయానికి ముందుండేవారు. బెళగావి, బాగల్‌కోట జిల్లాల్లోని నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాలకు కూడా జల క్షామం నెలకొంది. మహారాష్ట్ర నుంచి నీరు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆధ్వర్యంలో మంత్రులతో కలిసి చర్చలకు ముందుకు రాలేదు. వేసవిలో తాగునీరు అందక పోవడం, వర్షాకాలంలో పశ్చిమ ఘాట్‌లలో నీరు అధికంగా వచ్చి వరద రావడం, వీటి నుంచి ప్రజా ప్రతినిధులు మౌనం వహించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కృష్ణా నదిలో చుక్క నీరు లేక పోవడంతో చేపలు విరివిగా మరణించాయి. మరో వైపు నీరు లేక చివరికి చెలిమలో ఊరిన నీటిని చెంబుల ద్వారా పట్టుకుంటున్నారు. పంటల విషయంలో రైతులు ప్రతినిధులపై శాపనార్థాలు పెడుతున్నారు. నది పూర్తిగా ఎండిపోవడంతో లక్షలాది చేపలు వేసవి తాపానికి మరణించాయి. చనిపోయిన చేపలను తినడానికి పక్షులు వస్తున్నాయి. మరణించిన చేపల వల్ల గ్రామంలో దుర్వాసన వెదజల్లుతోంది. ప్రతి ఏడాది నీరు పుష్కలంగా ఉండేవి. పక్షులు వలసలు వచ్చేవి. నీరు ఇంకిపోవడంతో మరణించిన చేపలను తినడానికి వలస పక్షులు వస్తున్నాయి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు శూన్యం

ఎప్పటికి తీరేను గ్రామస్తుల దాహం

Advertisement
 
Advertisement
Advertisement