అక్రమాల కుప్ప.. తిరుమలకొప్ప | - | Sakshi
Sakshi News home page

అక్రమాల కుప్ప.. తిరుమలకొప్ప

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

హుబ్లీ: తాలూకాలోని అగడి గ్రామ పంచాయతీ పరిధిలోని తిరుమలకొప్ప గ్రామాభివృద్ధికి 2020–21వ సంవత్సరం నుంచి 2025–26 వరకు పంచాయతీ పాలనలో నిధి–1, 15వ ఆర్థిక ప్రణాళిక ద్వారా మంజూరైన నిధులు దుర్వినియోగమయ్యాయని ఆ గ్రామ నేత చెన్నవీర పాటిల్‌ ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ 34 పనులకు గాను గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు నకిలీ బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేశారని పేర్కొన్నారు. తిరుమలకొప్పను అక్రమాల కుప్పగా మార్చారని మండిపడ్డారు.

ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన

రాయచూరు రూరల్‌ : జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరులో ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన చేపట్టారు. మంగళవారం ప్రభులింగ బృహన్మఠంలో కిల్లే మఠాధిపతి శాంతమల్ల శివాచార్య 22వ పట్టాధ్యక్షుడు ప్రభులింగ శివాచార్యుల మూల విరాట్‌కు అభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన, మంగళ హారతి నెరవేర్చారు. అనంతరం ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన జరిపారు. గబ్బూరు మఠాధిపతి బూదిబసవ శివాచార్యులు, రేణుకాచార్య, శరణయ్యలున్నారు. భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించారు.

గుండెపోటుతో

యువ న్యాయవాది మృతి

సాక్షి,బళ్లారి: ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. కొప్పళ జిల్లా గంగావతి కోర్టు ఆవరణలో ఓ యువ న్యాయవాది గుండెపోటుతో కుప్పకూలారు. కనకగిరి తాలూకా చిక్కమాదినాళ గ్రామానికి చెందిన కనకేష్‌(25) అనే యువ న్యాయవాది గంగావతి కోర్టుకు వచ్చి తన విధులను నిర్వహిస్తున్న సమయంలో కోర్టు ఆవరణలో గుండైపె చేయి పెట్టుకుని నొప్పి ఎక్కువ కావడంతో కిందపడి పోయారు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఈ ఘటనతో మృత న్యాయవాది కుటుంబంతో పాటు గంగావతి కోర్టు ఆవరణలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కలబుర్గి జెడ్పీ సీఈఓగా నియామకం

రాయచూరు రూరల్‌: కలబుర్గి జెడ్పీ సీఈఓగా ఉన్న భన్వర్‌సింగ్‌ మీనాను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మహేంతేష్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో ఐటీ బీటీ శాఖలో విధులు నిర్వహిస్తున్న రాహుల్‌ సంకనూరును నియమించారు. జెడ్పీ సీఈఓ భన్వర్‌సింగ్‌ మీనాకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా బెంగళూరు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని సూచించారు.

పక్షుల దాహార్తి

నివారణకు ఏర్పాట్లు

రాయచూరు రూరల్‌: వేసవిలో పక్షుల దాహార్తిని నివారించేందుకు జిల్లా కేంద్రంలోని కోర్టులో విధులు నిర్వహించే న్యాయవాదులు, ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది మట్టి పాత్రలను ఏర్పాటు చేశారు. బుధవారం జిల్లా కోర్టులో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తులు జేడీ మహావర్‌ఖర్‌, శ్వేతా సింగ్‌, ప్రభు సిద్దప్ప, స్వాతిక్‌, కృపా, సుదీన, చెన్నబసప్ప మట్టి పాత్రలను అందించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున, శ్రీకాంత్‌, ఎస్‌జీ మఠ, లక్ష్మప్పలున్నారు.

రాతప్రతుల డిజిటలీకరణకు జిల్లాధికారిణి పిలుపు

హొసపేటె: తాళపత్రాలు ఉన్న ఇళ్లకు వెళ్లి, కుటుంబాలను ఒప్పించి, వాటిని సేకరించడం చాలా సవాలుతో కూడుకున్న పని, ఇంతటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించి, దానిని భావి తరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ చేయి కలపాలని జిల్లా మేజిస్ట్రేట్‌ కవిత ఎస్‌. మన్నికేరి అన్నారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో కవి పంప ఆడిటోరియంలో నిర్వహించిన కర్ణాటక ప్రాచీన రాతప్రతుల సర్వే, డిజిటలీకరణను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర డిజిటలైజేషన్‌ పనిని విజయనగర జిల్లాలోని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం చేపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కన్నడ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ డీవీ పరమ శివమూర్తి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ విరుపాక్షి పూజారహళ్లి, డీన్‌లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement