భారీ వర్షం .. అవస్థలు తీవ్రం | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షం .. అవస్థలు తీవ్రం

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

సాక్షి,బళ్లారి: వర్షం వచ్చిందంటే బళ్లారి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారడం సర్వసాధారణమైంది. భారీ వర్షం కురిస్తే రోడ్లు బురదమయంగా మారడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు నీటికుంటలను తలపిస్తాయి. ఈసారి ముందస్తు వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడు సార్లు ఒక మోస్తరు వర్షాలు కురిసాయి. మంగళవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. వర్షం వచ్చిన మరుసటి రోజున కూడా బుధవారం పలు ప్రాంతాల్లో నీటి కుంటలను తలపించాయి. జిల్లా స్టేడియంలో చిన్న చెరువును తలపించేలా నీరు నిలిచాయి. ఈ స్టేడియంలోకి ప్రతి రోజు పెద్ద ఎత్తున వాకింగ్‌ చేయడానికి జనం తరలివస్తుంటారు. వివిధ క్రీడలను ఆడేందుకు కూడా యువత వస్తుంటారు. ప్రస్తుతం కురిసిన వర్షానికి స్టేడియంలోకి నీరు చేరడంతో క్రీడాకారులు, వాకింగ్‌ చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి దృశ్యాలు మామూలు కావడంతో ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు, పాలకులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి.

రాయచూరులో..

రాయచూరు రూరల్‌: నగరంతో పాటు జిల్లాలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన జడివాన గంట సేపు ఏకధాటిగా కొనసాగి భారీ వర్షం కురిసింది. జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు జలమయం అయ్యాయి. గాంధీచౌక్‌, మున్నూరు వాడితో పాటు నగరంలోని కూరగాయల మార్కెట్‌లోకి వర్షపు నీరు చొరబడ్డాయి. అరబ్‌ కాలనీ పక్కనే వంతెనతో నీరు కాలనీలోకి ప్రవేశించాయి. రాయచూరు–హైదరాబాద్‌ రహదారిలో వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. మస్కిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ స్తంభం కూలింది. ఏపీఎంసీలోకి వాన నీరు చేరి ఉల్లిగడ్డలు, వరి ధాన్యం తడిసి పోయాయి.

చెరువును తలపిస్తున్న జిల్లా స్టేడియం

రాయచూరులో ఏపీఎంసీ జలమయం

Advertisement
 
Advertisement
Advertisement