● కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం డిమాండ్
హొసపేటె: విజయనగర జిల్లాలో విస్తృతంగా నెలకొన్న వడగాల్పుల నేపథ్యంలో ఈ ప్రాంత రైతులకు జీవనాధారమైన తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. కర్మాగారాలకు నీటి సరఫరాను నిలిపి వేసి, నీటిని కేవలం ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే కేటాయించాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. సంఘం తాలూకా కమిటీ నేతృత్వంలో రైతులు ఈ విషయమై జిల్లాధికారి, తుంగభద్ర బోర్డు అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఎండ తీవ్రత కారణంగా టీబీడ్యాంలో నీటిమట్టం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం డ్యాంలోని నీటిని ప్రజల, పశువుల తాగునీటి అవసరాల కోసం విజయనగర రాయ, బసవ కాలువల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. జీవరాశుల మనుగడకు, ప్రజల నిత్యవసరాలకు వీలుగా టీబీ డ్యాం నుంచి ఫ్యాక్టరీలకు సరఫరా అవుతున్న నీటిని తక్షణమే నిలిపి వేయాలని రైతులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. రైతు సంఘ తాలూకా అధ్యక్షుడు గంటి సోమశేఖర్‌తో పాటు పలువురు రైతులు హాజరయ్యారు.
ఆరోగ్య సిబ్బందితో
సమర్థ పాలన
● జిల్లాధికారిణి కవిత మన్నికేరి
హొసపేటె: నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై ఉండే అధికారులు, సిబ్బంది నేటి ఆధునిక జీవితంలో తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించగలరని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. బుధవారం నగరంలోని జెడ్పీ సభాంగణంలో అధికారులు, సిబ్బంది కోసం నిర్వహించిన ఉచిత ఆరోగ్య, కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. రోజువారీ విధి నిర్వహణ ఒత్తిళ్ల మధ్య ఉద్యోగులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. రోటరీ కంటి ఆస్పత్రి వైద్యుల బృందం అత్యాధునిక డిజిటల్ పరికరాలతో ఉచిత కంటి పరీక్షలతో పాటు రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలను నిర్వహించింది. అనంతరం సిబ్బందికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లాధికారిణి కవిత, జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్ అలీ అక్రమ్ షా కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ హంపీ పెర్‌ల్స్ అధ్యక్షురాలు అన్నపూర్ణ సదాశివ, కార్యదర్శి దీపా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో మందుల
విక్రయం అరికట్టాలి
రాయచూరు రూరల్: దేశ వ్యాప్తంగా మందులను ఆన్‌లైన్‌లో విక్రయించే వ్యాపారాలను నిలిపి వేయాలని రాయచూరు మందుల దుకాణాల యజమానుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జేఎస్ షిండే మాట్లాడారు. కార్పొరెట్ రంగంలో రాయితీలను స్తంభింప చేయాలని, స్పూరియస్ మందులను తొలగించాలన్నారు. అంతకు ముందు నగరంలోని అన్ని మందులు దుకాణాలను బంద్ చేసి నిరసన ర్యాలీ నిర్వహించారు. మహావీర్ సర్కిల్ నుంచి సూపర్ మార్కెట్ వరకు ర్యాలీగా వచ్చి నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద జిల్లాధికారిణి పూవితకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సంఘం రఘునాథ రెడ్డి, రాజీవ్ సింగహాల్, జీవన్, మురళీధర్, వెంకటేష్, అరవింద్, సురేష్, మురారీ అగర్వాల్‌లున్నారు.


