హొసపేటె: భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి చేతికొచ్చిన అరటి, బొప్పాయి పంటలతో పాటు పాఠశాల గోడ కూడా దెబ్బతిన్న ఘటనలు విజయనగర జిల్లాలో బుధవారం చోటు చేసుకున్నాయి. నింబళగెరెలోని పాఠశాల భవనం కారుతుండటంతో వారు పైకప్పుపై ఇనుప రేకులను పరిచారు. ఈదురు గాలికి పైకప్పుతో సహా రేకులన్నీ నేలకూలాయి. మంగాపుర, నింబళగెరె, యర్రమ్మనహళ్లి, గాణగట్టి, ఉజ్జయిని చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఈ గ్రామాల్లో బొప్పాయి పండించే రైతులు చాలా మంది ఉన్నారు. బలమైన గాలులకు బొప్పాయి మొక్కలు సగానికి విరిగి నేలకూలాయి. అప్పులు చేసి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో ఇలా గాలివానలకు దెబ్బ తినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.


