హుబ్లీ: ధార్వాడ శివారులో వృద్ధురాలి మృతదేహం లభ్యమైన కేసులో మిస్టరీని గ్రామీణ పోలీసులు కేసును ఛేదించారు. తాలూకాలోని దడ్డి కమలాపుర శివారు తోటలోని ఓ ఇంట్లో గత నెల 9న విశాలాక్షి అంగడి (68) అనే వృద్ధురాలి మృతదేహం లభించింది. అనుమానం నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులకు ముందుగా ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు. అయితే కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టడంతో తలకు దెబ్బ తగలడంపై ఫోరెన్సిక్ సైన్స్ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు గట్టురట్టయింది. హంతకుడిని మహారాష్ట్రకు చెందిన బబన్ సదాశివ జావిర్ (40)గా గుర్తించారు. ఒంటరి మహిళలే అతడి టార్గెట్. చిక్కమల్లిగెవాడ ఇటుకల బట్టీలో పని చేస్తున్న ఇతడు వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోందని పసిగట్టాడు. ఆమెతో ఎలాగోలా పరిచయం చేసుకొని నమ్మకం సంపాదించాడు.
అమాయకత్వమే అస్త్రంగా..
పిల్లల నుంచి దూరంగా ఉన్న విశాలాక్షిని బుజ్జగించే మాటలతో మీ పిల్లలు దూరమైతేనేం నేను మీ కొడుకులా ఉంటానంటూ నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన వృద్ధురాలు అప్పుడప్పుడు ఫోన్‌లో బాధలను పంచుకునేది. ఆ అమాయకత్వాన్నే అస్త్రంగా చేసుకున్న నిందితుడు అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి కాలక్షేపంగా కబుర్లు చెప్పేవాడు. ఈ క్రమంలో ఒక రోజు ఇంటికి వచ్చి తాను అనుకున్నట్లుగా ఆమె తలపైన కొట్టి తాడుతో గొంతు బిగించి ఊపిరి తీసి హత్య చేసి పరారైనట్లు దర్యాప్తులో తేర్చారు. నిందితుడి నుంచి ఓ బైక్, రూ.4.70 లక్షల విలువ చేసే బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కొన్నేళ్ల క్రితం హరిహర హత్య కేసులో కూడా అరెస్ట్ అయ్యాడన్న సంగతి దర్యాప్తులో తెలుసుకున్నారు. అక్కడ ఇటుకల బట్టీ యజమానిని హత్య చేసిన బబన్ ఆ తర్వాత అతడి వద్ద ఉన్న డబ్బులను తీసుకొని పరారయ్యాడు. ఆ కేసు విచారణలో ఉండగానే తాజాగా వృద్ధురాలిని హత్య చేయడంతో నిందితుడిని జుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య మీడియాకు వివరించారు.
వీడిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ
ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్


