రెండేళ్లలో 5 వేల మంది రైతుల ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో 5 వేల మంది రైతుల ఆత్మహత్య

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

కేంద్ర మంత్రి కుమారస్వామి

బనశంకరి: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను కాంగ్రెస్‌ సర్కారు దాచిపెట్టిందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖమంత్రి హెచ్‌డీ.కుమారస్వామి ఆరోపించారు. మంగళవారం నగరంలోని జేడీఎస్‌ ఆఫీసులో ఆయన మాట్లాడారు. అన్నదాతలు ఆత్మహత్యల పెరిగాయని పత్రికల్లో గమనించానన్నారు. తీవ్ర దిగ్భ్రాంతి చెందానని, ప్రభుత్వం కళ్లుమూసుకుని కూర్చుందా? అని భావించానని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సాధనా సంబరాలు చేసుకుంటూ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2023లో 2,423 మంది, 2024లో 2,971 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రెండేళ్లలో మొత్తం 5,394 మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారని, రైతుల ఆత్మహత్యల్లో కర్ణాటక దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వివరాలు తెలియవా, లేక తెలిసినప్పటికీ మౌనంగా ఉందా? అనే అనుమానం కలుగుతోందని దుయ్యబట్టారు. బెంగళూరులో 10 నిమిషాలు వర్షం వస్తే ఎక్కడ చూసినా నీరు నిలబడుతోందని మండిపడ్డారు. సాధనా సమావేశానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందన్నారు. రైతులు, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని క్షమించరని మండిపడ్డారు. బిడది టౌన్‌షిప్‌పై డీసీఎం డీకే శివకుమార్‌తో చర్చకు సిద్ధమని చెప్పారు.

హోటల్‌ గదిలో తూటాల పెట్టె

వదిలేసి వెళ్లిన వ్యక్తి అరెస్టు

బనశంకరి: పిస్టల్‌ తూటాల పెట్టెను హోటల్‌లో వదిలేసిన వెళ్లిన ఉదంతం కలకలం సృష్టించింది. అర్మాన్‌ ముతాహర్‌ (34), ఓ యువతితో కలిసి వచ్చి బెంగళూరు జయమహల్‌ ప్యాలెస్‌ హోటల్‌లో రూంలో దిగాడు. గత నెల 27 తేదీ రాత్రి హోటల్‌కు వచ్చిన అతడు నేను యుఎస్‌ఏ గ్రీన్‌కార్డు హోల్డర్‌ అని తెలిపి పాస్‌పోర్ట్‌ చూపించాడు. మరుసటి రోజు రూం ఖాళీ చేశారు. కొంతసేపటికి హోటల్‌ రిసెప్షన్‌కి ఫోన్‌ చేసి గదిలో పిస్టల్‌ తూటాల మ్యాగజైన్‌ మరిచిపోయానని, వచ్చి తీసుకుంటానని చెప్పాడు. ఈ నెల 4వ తేదీన హోటల్‌ సిబ్బంది అతనికి ఫోన్‌ చేసి తూటాలను ఇక్కడ ఉంచుకోలేమని, తీసుకెళ్లాలని, లేదంటే పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు. తానే వచ్చి తీసుకుంటానని ఆ వ్యక్తి తెలిపాడు. చివరకు హోటల్‌ సిబ్బంది జేసీ నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి మ్యాగజైన్‌ను అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి అర్మాన్‌ ముతాహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తూటాలు అమెరికాలో తయారైనవని తేలింది. ఆయుధాల చట్టం ఉల్లంఘన కింద విచారణ చేపట్టారు.

బైక్‌ను కారు ఢీ, ఒకరు మృతి

మైసూరు: కారు, బైక్‌ ఢీకొనడంతో ఒకరు మరణించిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. బెంగళూరు నివాసి మంజు (23) మృతుడు. ఇతను మైసూరు నగరంలోని బన్నూరు రోడ్డులోని కేఈబీ స్టేషన్‌లో జరుగుతున్న పనుల్లో పాల్గొనేందుకు వచ్చాడు. మంజు, అతని స్నేహితుడు వికాస్‌ భోజనానికి దేవెగౌడ సర్కిల్‌లో హోటల్‌కు వచ్చారు. తర్వాత బైక్‌లో వాపసు ఇంటికి వెళుతుండగా బన్నూరు మెయిన్‌ రోడ్డులోని టీఎంఈ కాలేజీ వద్ద వేగంగా దూసుకువచ్చిన కారు బైక్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరూ బైక్‌ పైనుంచి కిందపడ్డారు. మంజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. కారు డ్రైవరుపై వరుణ పోలీసులు కేసు నమోదు చేశారు.

తోటల్లో గజ మంద విధ్వంసం

మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలే మహదేశ్వర కొండ చుట్టుపక్కల గ్రామాల్లో అడవి ఏనుగుల బెడద పెరిగిపోవడంతో రైతులకు నిద్ర పట్టడం లేదు. కిరణహోళ గ్రామానికి చెందిన రైతు తోటలోకి చొరబడిన ఏనుగులు పనస, మామిడి చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. రాత్రి తోటల్లోకి ప్రవేశించిన అడవి ఏనుగుల గుంపు, ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న ఫలవంతమైన చెట్లను వేళ్లతో సహా పెకిలించి నాశనం చేశాడని, దీంతో రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధిత రైతులు తెలిపారు. మలే మహదేశ్వర కొండ అటవీ ప్రాంతంలో ఆహారం, నీటి కొరత కారణంగా అడవి ఏనుగులు రోజూ భూములపై దాడి చేస్తున్నాయని, దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొందని తెలిపారు. ఈ నేపథ్యంలో, సంబంధిత అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, తక్షణమే తగిన నష్టపరిహారం అందించాలని, ఏనుగులకు అడ్డుకట్ట వేయాలని కోరారు.

ఇంట్లోకి కింగ్‌ కోబ్రా

యశవంతపుర: చిక్కమగళూరు జిల్లాలో వేసవి ఎండలు, మధ్యలో వర్షాల వల్ల పాముల బెడద పెరిగింది. భారీ నాగుపాములు ఇళ్లలోకి వస్తున్నాయి. మూడిగెరె తాలూకా కె.తలగూరులో మంజునాథ్‌ అనే వ్యక్తి ఇంటిలోకి 12 అడుగుల పొడవైన కింగ్‌ కోబ్రా చొరబడింది. తలుపు వద్ద పడగ తీసి నిలబడింది, దానిని చూసి అందరికీ వణుకు పుట్టింది. ఒణకల్‌కు చెందిన పాములు పట్టే అరిఫ్‌ను రప్పించారు. ఆయన గంటపాటు కష్టపడి ఆ కాళింగ సర్పాన్ని పట్టుకుని దూరంగా తరలించారు. తాను ఇప్పటి వరకు 318 కాళింగ సర్పాలను బంధించినట్లు అరిఫ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement