కోలారు: ముళబాగిలు నగరంలోని శ్రీ బాల సుబ్రమణ్వేరస్వామి దేవాలయంలో మంగళవారం అధిక జేష్టమాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయమే స్వామివారి మూల విగ్రహానికి అభిషేకించి తరువాత ప్రత్యేక పూలతో అలంకరించారు. వడల మాలను సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
కట్న వేధింపులకు
నవ వివాహిత బలి
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని నాగానగర గ్రామంలో నవ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికురాలు ఐశ్వర్య (20)కు, జనవరిలో జీఆర్ నగరకు చెందిన నవీన్‌తో పెళ్లయింది. కొన్నిరోజులకే భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధించడంతో ఆమె పుట్టినింటికి వచ్చేసింది. ఎన్నో ఆశలతో జరిగిన పెళ్లి విఫలమైందని ఆవేదన చెంది తమ తోటలోని ఇంట్లో ఉరి వేసుకుంది. వరకట్న వేధింపులు, అవమానాల కారణంగానే తన కుమార్తె మరణించిందని తండ్రి పళనిస్వామి.. ఆమె భర్త నవీన్, మామ మాదేశ్, అత్త ఈశ్వరి తదితరులపై రామాపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాపాడమ్మా యల్లమ్మా
కోలారు: నగరంలోని రేణుకా యల్లమ్మ దేవాలయంలో మంగళవారం అమ్మవారికి దీపోత్సవం, హోమం, విశేష పూజలు జరిగాయి. పూజా కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు అన్న సంతర్పణ జరిగింది. మంత్రి కెహెచ్ మునియప్ప పాల్గొని మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం, కోలారు జిల్లాలో వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని పూజలు చేయడం సంతోషకరమన్నారు. రేణుకా యల్లమ్మ శక్తిదేవత అయి ఉండి ప్రజల కష్టాలకు స్పందించి ఇష్టార్థసిద్దిని ప్రసాదిస్తుందన్నారు.
అది సమారాధన సభ
● బీజేపీ చీఫ్ విజయేంద్ర
శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లయినా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, తుమకూరులో జరిపింది ప్రభుత్వ సాధన సమావేశం కాదని, ప్రభుత్వ సమారాధన అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర దుయ్యబట్టారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో బీజేపీ ఆఫీసులో మాట్లాడారు. ప్రభుత్వ ప్రకటనలను ప్రస్తావిస్తూ హేళన చేశారు. పెద్ద పెద్ద పదాలతో పత్రికలకు ెపెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారని, ఏం సాధించారని ఈ సభ పెట్టారని విమర్శించారు. సిద్దరామయ్య అహింద వర్గాన్ని వాడుకుని అధికారం అనుభవిస్తున్నారు, రాష్ట్రమంతటిని అప్పుల్లో కూరుకునేటట్లు చేశారని అన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తంగా మారాయన్నారు. గుంతల రోడ్లను సరిచేయలేదన్నారు. కరువు, వరదల్లో రైతులను కనీసం పరామర్శించలేదన్నారు. అభివృద్ధి శూన్యం, అవినీతి మాత్రం ఘనమన్నారు. తుమకూరు సభకు ప్రజల సొమ్మును యథేచ్ఛగా ఖర్చు చేశారన్నారు. గ్యారెంటీల సొమ్ముతోనే ఉప ఎన్నికల్లో గెలిచారని, ఇది కొనసాగదని అన్నారు.
దర్శన్‌తో భార్య భేటీకి ఓకే
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న నటుడు దర్శన్‌కు కొంచెం ఊరట కలిగింది. దర్శన్‌ను కలవడానికి భార్య విజయలక్ష్మి, కొడుకు వినీశ్‌కు జైలు, పోలీసు అధికారులు అనుమతిచ్చారు. కుటుంబంతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని దర్శన్ ఇటీవల వినతి చేశారు. మామూలుగా ఖైదీలను కుటుంబసభ్యులు కలవాలంటే ఇనుప కడ్డీలు, అద్దం అడ్డుగా ఉంటాయి, అలాగే మాట్లాడుకోవాలి. కానీ దర్శన్‌కు ముఖాముఖి సంభాషణకు వీలుంది.
యమపాశమైన చీర
దొడ్డబళ్లాపురం: నిచ్చెనకు కట్టిన చీర గొంతుకు చుట్టుకుని బాలిక మృతిచెందిన సంఘటన చిక్కమగళూరు జిల్లా శృంగేరి తాలూకా కల్లొళ్లి గ్రామంలో జరిగింది. 8వ తరగతి చదువుతున్న సప్తమి (14) మృతురాలు. సెలవులు కావడంతో సప్తమి నానమ్మ ఇంటికి వచ్చింది. ఇంటి అటకమీద ఆడుకుంటున్న సప్తమి నిచ్చెన ద్వారా కిందకు దిగుతుండగా నిచ్చెనకు కట్టిన చీర గొంతుకు చుట్టుకుని ఊపిరాడక స్పృహ తప్పింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో చనిపోయింది. శృంగేరి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.


