తుమకూరు: రాష్ట్రంలో బెంగళూరుతో సహా పలు జిల్లాల్లో సోమవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా హుళియారులో రాత్రి ఏకధాటిగా వీచిన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి యళనాడు గ్రామ పంచాయతీ పరిధిలో 40కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మూడు ప్రధాన ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. దీంతో పలు గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. యళనాడు, సింగాపుర, మోటిహళ్లి, కెరెసూరుగొండనహళ్లి, హుళియారు సమీపంలోని కెంకెరె పరిధిలో విధ్వంసం ఏర్పడింది. పండరగుత్తి వద్ద ప్రైమరీ, సెకండరీ కరెంటు తీగలపై పెద్ద చెట్లు విరిగి పడటంతో స్తంభాలు కూడా విరిగి పడ్డాయి. మరమ్మతు పనులను చేపట్టినట్లు బెస్కాం ఎస్‌ఈ రఘురాం తెలిపారు.
ఇళ్లు ధ్వంసం
శివమొగ్గ తాలూకాలోని కుడ్లిగెరె, హోళహొన్నూరు హోబ్లీ పరిధిలోని అనేక గ్రామాలలో గాలీవానకు చెట్లు విద్యుత్ లైన్లపై కూలిపోయాయి. రేకుల ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. చాలా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బాధిత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
తుమకూరు జిల్లాలో కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు
అంధకారంలో పలు గ్రామాలు


