యశవంతపుర: కొడగు జిల్లాలో దుబారె ఏనుగుల శిబిరంలో సోమవారం ఏనుగులు కంచన్, మార్తాండ పోట్లాటలో మార్తాండ కిందపడిపోగా దాని కింద చిక్కి మరణించిన చైన్నె పర్యాటకురాలు జునేష (33) నేత్రాలను భర్త దానం చేశారు. అంత దుఃఖంలోనూ భర్త జోయెల్ నేత్రదానం చేసి మానవీయతను చాటుకున్నారు. ఈ దుర్ఘటనలో ఆమె దేహం నుజ్జుయింది. ఇతర అవయవాలను కూడా దానం చేయాలని అనుకున్నా సాధ్యం కాలేదని వైద్యులు తెలిపారు. భార్యను తలచుకుని జోయెల్ కన్నీరుమున్నీరయ్యారు. దుర్ఘటనకు కొంతసేపటి ముందు జునేష తీసుకున్న ఫోటో వైరల్ అయ్యింది. ఇందులో ఆమె ఏనుగుల వద్ద సెల్ఫీ తీసుకుంది.
మావటీలే రెచ్చగొట్టారా?
ఏనుగుల మధ్య గొడవను మావటీలు అడ్డుకోలేదా, మావటీల మధ్య విభేదాలతో ఏనుగులను ఘర్షణకు ప్రేరేపించారా, అనే పలు అనుమానాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఏనుగుల శిబిరంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు, టూరిస్టులను ఇష్టానుసారం వదిలేశారు అని అటవీశాఖ, పర్యాటకశాఖ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. ఓవైపు కావేరి నది, మరోవైపు భారీ కాయాల ఏనుగులు ఉన్నా పర్యాటకుల భద్రతకు పట్టించుకోలేదని విమర్శలున్నాయి. ఇక బుధ, గురువారం పర్యాటకులను నిషేధించారు. కాగా దసరా ఏనుగులను వరుసగా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 2023 డిసెంబరులో హాసన్ జిల్లాలో ఓ అడవి ఏనుగును బంధించే ఆపరేషన్‌లో అటవీ సిబ్బంది కాల్పుల్లో గజరాజు అర్జున నేలకొరిగింది.
దుబారె ఏనుగు శిబిరం విషాద ఘటన..


