లెక్చరర్ల కొరత.. విద్యార్థులకు వెత | - | Sakshi
Sakshi News home page

లెక్చరర్ల కొరత.. విద్యార్థులకు వెత

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

సాక్షి బళ్లారి: ఈఏడాది ఉమ్మడి బళ్లారి జిల్లాలో 10వ తరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ్పభిగణనీయంగా పెరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా కళాశాలల్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు పేద విద్యార్థులు అధిక సంఖ్యలో మొగ్గుచూపుతున్నా బోధన సిబ్బంది, వసతులు లేక ప్రైవేటు కళాశాలల్లో చేరేందుకే మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో దాదాపు 180 మందికి పైగా లెక్చరర్ల కొరత వేధిస్తుండటంతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు వెనుకంజ వేస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ మున్సిపల్‌ కళాశాల ఒకప్పుడు ఈ కళాశాలలో చేరేందుకు సీట్లు దొరకాలంటే విద్యార్థులు అష్టకష్టాలు పడేవారు. ప్రస్తుతం మున్సిపల్‌ కళాశాలలో సిబ్బంది కొరత, వసతులు లేకపోవడంతో ఏటేటా చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. మున్సిపల్‌ కాలేజీలో 22 మంది బోధన సిబ్బంది కొరత ఉన్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కళాశాలలో ఎలా చేరాలి? అని పేద విద్యార్థులు కన్నీరుపెడుతున్నారు.

మెరుగైన విద్య కరువై ప్రైవేటు వైపు విద్యార్థుల మొగ్గు

ఒక్క మున్సిపల్‌ కళాశాలలో సిబ్బంది కొరత ఉంది అనుకుంటే పొరపాటు. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఇదే విధమైన సమస్య వేధిస్తోంది. బళ్లారి జిల్లాలోని 21 పీయూ కళాశాలల్లో 95 మంది లెక్చరర్లు, 8 మంది ప్రిన్సిపాల్స్‌ కొరత ఉండగా, విజయనగర జిల్లాలో 28, ప్రభుత్వ కళాశాలలకు గాను 85 మంది లెక్చరర్లు, 15 మంది ప్రిన్సిపాల్స్‌ కొరత వేధిస్తుండగా, ఇందులో ప్రధానంగా ముఖ్యమైన సబ్జెక్టులకు సంబంధించి అంటే గణితం, సైన్స్‌(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ), ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో లెక్చరర్ల కొరత ఉన్నట్లు ఆయా కళాశాలల సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సిబ్బంది కొరత ఉందని తెలియడంతో పేద విద్యార్థులు కూడా అష్టకష్టాలతో ప్రైవేటు కళాశాలల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. మరో 15 రోజుల్లో పీయూ కళాశాలలు ప్రారంభమవుతుండగా ప్రభుత్వ కళాశాలల్లోని సిబ్బందిని భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలను లెక్కిస్తోంది. దీంతో ఇదే అదునుగా చేసుకొని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చుకొని ఏటేటా ఫీజులను విపరీతంగా పెంచుతూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

అప్పు చేసైనా ప్రైవేట్‌ కాలేజీల్లో

చదివిస్తున్న తల్లిదండ్రులు

తల్లిదండ్రులు కూడా అప్పుల పాలవుతున్నారు. సర్కారీ కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉండగా, ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్లు దక్కించుకోవడానికి విద్యార్థులు ఆరాటపడుతున్నారు. నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేటు కళాశాలలు ఏటేటా ఫీజులను పెంచుతూ దోపిడీ చేస్తుండగా, కట్టడి చేసే సామర్థ్యం ఉన్న ప్రభుత్వ పెద్దలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను చదివించడానికి బంగారం, ఆస్తులను అమ్మాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని విధాలైన సౌకర్యాలు, వసతి, బోధన సిబ్బందిని కల్పిస్తే ప్రైవేటు కళాశాలల్లో తాము ఎందుకు తమ పిల్లలను చేర్పించి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుంటామని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత పాలకులు, అధికారులు స్పందించి ప్రభుత్వ కళాశాలల్లో బోధన సిబ్బందిని నియమించి సామాన్య, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించేందుకు తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రభుత్వ పీయూ కాలేజీల్లో వేధిస్తున్న సిబ్బంది లోటు

అఖండ బళ్లారిలో 180కి పైగా

లెక్చరర్‌ పోస్టులు ఖాళీ

ఫీజుల భారంతో విద్యార్థుల తల్లిదండ్రులు సతమతం

సర్కారు నిర్లక్ష్యమే ప్రైవేటు కళాశాలల దోపిడీకి ఊతం

Advertisement
 
Advertisement
Advertisement