అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

భర్త అరెస్ట్‌

సాక్షి,బళ్లారి: అత్తింటి వేధింపులను తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. భర్త, అత్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బళ్లారి జిల్లా కంప్లి పట్టణంలో గృహిణి ఐశ్వర్య తన భర్త, అత్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త పశుసంవర్థక శాఖలో పని చేస్తుండేవాడు. పెళ్‌లైన కొత్తలో బాగానే సాగిన కాపురం బెంగళూరులో సంసారం పెట్టిన 9 నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయని భార్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అత్త, భర్త ప్రతి రోజూ చిన్న గొడవలు పెట్టుకొని వేధించేవారని, దీంతో మనస్తాపంతో ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతికి కారణమైన భర్త ప్రదీప్‌కుమార్‌ను కంప్లి పోలీసులు అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రి మృతికి సంతాపం

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటకలోని తాలూకాల అభివృద్ధి విషయంలో ముందుండాలని కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఆదివారం కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. నూతన తరగతి గదులు, ఆస్పత్రులు, రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి పథకాలు, ఇతరత్ర పనులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమావేశంలో మంత్రులు శరణ ప్రకాష్‌ పాటిల్‌, ప్రియాంక్‌ ఖర్గే, ఈశ్వర్‌ ఖండ్రే, శివరాజ్‌ తంగడిగి, బోసురాజ్‌, రహీంఖాన్‌, శరణ బసప్ప దర్శనాపురలున్నారు. అంతకు ముందు మంత్రి సుధాకర్‌ మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

పరారీలో ఉన్న

నిందితుడు అరెస్ట్‌

ఎట్టకేలకు గోవాలో పట్టివేత

హుబ్లీ: 16 ఏళ్ల క్రితం లారీలో లక్షలాది రూపాయల విలువ చేసే సరుకులతో ఉడాయించిన నిందితుడిని అరెస్ట్‌ చేయడంలో హుబ్లీ గ్రామీణ పోలీసులు సఫలీకృతులయ్యారు. జిల్లాలోని కమలాపుర నివాసి లోకేష్‌ భీమక్కన్నవర అరెస్ట్‌ అయిన నిందితుడు. 2010 జూన్‌ 7న నిందితుడు లోకేష్‌ శ్రీరామ్‌ ఫైనాన్స్‌ నుంచి సీజ్‌ అయి నిలబడిన లారీ నెంబర్‌ ప్లేట్‌ను తన లారీకి అమర్చుకున్నాడు. ఆ తర్వాత నకిలీ రికార్డులు సృష్టించి కార్బోక్యారియర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ మేనేజర్‌ను నమ్మించాడు. హిందూస్తాన్‌ లివర్‌ కంపెనీ నుంచి హొసపేటె, కొప్పళకు చేర్చాల్సిన రూ.14,87,289 విలువ చేసే సోపులు, పౌడర్‌, శ్యాంపు తదితర వస్తువులను లారీలో లోడ్‌ చేసుకొని వెళ్లి వేరే చోట విక్రయించడానికి ప్రయత్నించాడు.

2010లో కేసు నమోదు

ఘటనపై 2010 జూన్‌ 11న హుబ్లీ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో వంచన కేసు నమోదైంది. కేసు నమోదయ్యాక కోర్టు నుంచి బెయిల్‌ పొందిన నిందితుడు అనంతరం విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నాడు. దీంతో కోర్టు అతడిపై వారెంట్‌ జారీ చేసింది. నిందితుడి కోసం హుబ్లీ రూరల్‌ సీఐ ఎంఆర్‌ చెన్ననవర నేతృత్వంలోని బృందం గాలించి నిందితుడు ఉపయోగించే వివిధ మొబైల్‌ నెంబర్లను తెలుసుకుని అతడు ఇతర రాష్ట్రాల్లో దాగి ఉన్నాడని ధృవీకరించుకున్నారు. గత నెల రోజులుగా వివిధ రాష్ట్రాల్లో మకాం వేసిన పోలీస్‌ బృందాలు ఈ నెల 14న గోవాలో అతడిని అరెస్ట్‌ చేశాయి.

బీదర్‌లో కబడ్డీ

క్రీడాకారిణిపై హత్యాచారం

రాయచూరు రూరల్‌: బీదర్‌ జిల్లాలో కబడ్డీ క్రీడాకారిణిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన సోమవారం జరిగింది. బీదర్‌కు చెందిన క్రీడాకారిణి(15)పై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని కర్ణాటక భీమ సేన అధ్యక్షుడు శంకర్‌ రామలింగయ్య ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మాట్లాడుతూ దళిత బాలికపై ఘోరానికి పాల్పడిన దోషులకు బీదర్‌ జిల్లా ఎస్పీ ప్రదీప్‌ గుంటి రక్షణ కల్పిస్తున్నారని, ఆ ఎస్పీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

పేలిన మందుగుండు..

నలుగురికి గాయాలు

మాలూరు: కొండపై రాతి బండలను పేల్చేందుకు ఉపయోగించే మందుగుండు పేలి నలుగురు వ్యక్తులు గాయపడిన ఘటన మంగళవారం తాలూకాలోని కదరేనహళ్లి గ్రామ సమీపంలోని కొండపై చోటు చేసుకుంది. కొప్పళ జిల్లాకు చెందిన కార్మికులు చిరంజీవి, రాము, హేమంత, రాజు గాయపడ్డారు. ఎప్పటిలాగా కొండపై పని చేస్తున్న సమయంలో కార్మికులు బండను బ్లాస్ట్‌ చేయడానికి ప్రయత్నించారు. అకస్మాత్తుగా మందుగుండు పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన నలుగురిని చికిత్స కోసం కోలారులోని ఆర్‌.ఎల్‌.జాలప్ప ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాస్తి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాంబ్‌ స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీ చేశారు. రాతి బండ యజమాని హనుమంతప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement