దేవెగౌడ ప్రతిమకు క్షీరాభిషేకం | - | Sakshi
Sakshi News home page

దేవెగౌడ ప్రతిమకు క్షీరాభిషేకం

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

రాయచూరు రూరల్‌ : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ 93వ జన్మదినాన్ని దేవదుర్గలో ఘనంగా ఆచరించారు. దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ గోపాలకృష్ణ నాయక్‌ గాణదాళలో దేవెగౌడ ప్రతిమకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృష్ణానది నుంచి సాగునీటిని పారించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన మహా నేత దేవెగౌడ అని అభివర్ణించారు.

భూముల అక్రమ స్వాధీనం తగదు

రాయచూరు రూరల్‌: జిల్లాలో అక్రమంగా భూములను స్వాధీనం చేయడం తగదని రాష్ట్ర ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవాలని రైతు సంఘం డిమాండ్‌ చేసింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు రూప మాట్లాడారు. దేవదుర్గ తాలూకా అరకెరలో 100 ఎకరాలకు పైగా సర్కారు భూములను ఆక్రమించారని, దానికి తహసీల్దార్‌ అమరేష్‌ బిరాదార్‌ మద్దతు పలుకుతున్నారని, అలాంటి అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు.

జంతు, ప్రాణి బలి వద్దు

రాయచూరు రూరల్‌: జిల్లాలో బక్రీద్‌ పండుగను పురస్కరించుకొని వన్య జీవులు, జంతు ప్రాణులను బలి ఇవ్వవద్దని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బక్రీద్‌ పండుగపై అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఒంటె, గోవులు, పశువులను చంపడం నిషేధమన్నారు. వాటిని వధించరాదని ఆదేశించారు. పశువులను తరలించే సమయంలో పోలీసులు, పశు సంవర్థక శాఖాధికారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుండాలన్నారు. సమావేశంలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, ఏడీసీ శివానంద, అధికారులు కుమారస్వామి, తిమ్మప్ప, శరణప్ప, జోసెఫ్‌, మల్లికార్జున, రాజశేఖర్‌, పోం సింగ్‌, ఉమేష్‌ కాంబ్లేలున్నారు.

విలేకరి మృతికి సంతాపం

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లాలోని హట్టికి చెందిన సీనియర్‌ పాత్రికేయుడు సోమణ్ణ గురికార్‌ మృతికి విలేకరుల సంఘం ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా విలేఖర్ల సంఘం అధ్యక్షుడు గురునాథ్‌ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో గురికార్‌ చేసిన సేవలు గురించి వివరించారు. రెండు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో సోమణ్ణ విశేషంగా రాణించారన్నారు. సిద్దయ్య, చెన్నబసవ, శ్యాం, గౌడ, మంజునాథ్‌, శివమూర్తి, ప్రసన్న జైన్‌, ముత్తన్న, వీరభద్రప్ప, పాషా పాల్గొన్నారు.

కుంటలో పడి ఇద్దరు బాలికల మృతి

సాక్షి, బళ్లారి: వ్యవసాయ కుంటలో కాలు జారి పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా యరేహంచినాళ గ్రామ శివార్లలో జరిగింది. గదగ్‌ జిల్లా తిమ్మాపుర గ్రామానికి చెందిన లక్ష్మవ్వ(15), ముత్తవ్వ(16) అనే ఇద్దరు బాలికలు వ్యవసాయ కుంట వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదవాతావరణం నెలకొంది. ఘటనపై కుకనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

నేడు మెడికల్‌ షాపుల బంద్‌

శివాజీనగర: వివిధ డిమాండ్లతో మెడికల్‌ షాపుల యజమానులు దుకాణాలను బుధవారం మూసివేయనున్నారు. రాష్ట్రంలో వేలాది మెడికల్‌ షాప్‌లు బంద్‌ కానున్నాయి. రాష్ట్రంలో సుమారు 26 వేలకు పైగా మెడికల్‌ షాప్‌లు, బెంగళూరులో సుమారు 6,500లకు పైగా షాపులు ఉన్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా ఔషధాల అమ్మకాన్ని నిలిపివేయాలని ప్రధానంగా కోరుతున్నారు. విచ్చలవిడి అమ్మకాల వల్ల ఔషధాల దుర్వినియోగం పెరిగిపోతుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement