సాక్షి బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సాగించిన మూడేళ్ల పాలన వంద అబద్ధాలతో కొనసాగిందని, పచ్చి అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసం చేయడంతోనే కాంగ్రెస్ పాలన సాగుతోందని మాజీ మంత్రి శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ అబద్ధాలకు సాక్ష్యంగా నిలిచారన్నారు. కేవలం అబద్ధాలపై పునాదులు కట్టుకొని పాలన సాగిస్తున్నారన్నారు. మూడేళ్లలో ఏం సాధించారని సంబరాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నిలదీశారు.
రైతుల పరిస్థితి దారుణం
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు విత్తనాల కొరత, మరో వైపు వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి పంటలకు పెట్టిన పెట్టుబడులు దక్కకుండా పోతున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య పట్టి పీడిస్తోందన్నారు. ఐదు గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చి ఆ పథకాలను సక్రమంగా అందజేయకుండా ఓటర్లను మోసగించారన్నారు. వాల్మీకి అభివృద్ధి మండలిలో కోట్లాది రూపాయల అవినీతి మూడేళ్ల పాలనకు సాక్ష్యంగా నిలిచిందన్నారు.
పాకిస్తాన్‌కు జిందాబాద్‌పై చర్యలు శూన్యం
పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన విషయంలో ఓ కాంగ్రెస్ నాయకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మధ్య అధికారం కోసం కుర్చీ ఆట సాగుతోందన్నారు. సీఎం పదవి కోసం డీకేశి పైరవీలు చేస్తున్నారని, ఆ కుర్చీని కాపాడుకునేందుకు సిద్ధరామయ్య పాట్లు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ నాయకులు అనిల్‌కుమార్ మోకా, వీరశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్ మోత్కర్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.
రైతు ఆత్మహత్యలు, ధరల పెరుగుదల, రవాణా సంక్షోభంపై ఆగ్రహం
వాల్మీకి అభివృద్ధి మండలి, ఐదు గ్యారంటీల అమలులో చిత్తశుద్ధి లోపం
బీజేపీ నేత, మాజీ మంత్రి బీ.శ్రీరాములు మండిపాటు


