20వ తేదీకి సిద్దరామయ్య సర్కారు ఘనత | - | Sakshi
Sakshi News home page

20వ తేదీకి సిద్దరామయ్య సర్కారు ఘనత

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

నేడు తుమకూరులో భారీ బహిరంగ సభ పాల్గొననున్న సీఎం, డీసీఎం, మంత్రులు

సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మే 20తో మూడేళ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 4వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. మంగళవారం తుమకూరులో అట్టహాసంగా సాధన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం, డీసీఎం, మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు ఈ సభలో పాల్గొంటారు. పలు పథకాల కింద ఈ సమావేశంలో వేలాది లబ్ధిదారులకు సంక్షేమ పత్రాలను అందిస్తారు.

అన్నీ నాటకీయంగా..

అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా గెలవడం, ఢిల్లీలో నాటకీయ పరిణామాల సీఎం, డీసీఎంల ఎంపిక జరగడం కొత్త విషయమేమీ కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రతిపక్షాలు ఆశించినంత పుంజుకోలేకపోవడం, ఉప ఎన్నికలలో గెలుపు, పంచ గ్యారంటీ పథకాలతో ప్రజాకర్షణ అనేవి ప్రభుత్వానికి అనుకూలమయ్యాయి. ఇదే సమయంలో ఆ గ్యారెంటీ స్కీముల అమలు ద్వారా ఖజానాపై భారం పడడంతో ధరల పెంపు మార్గాన్ని ఆశ్రయించింది. ఇలా ఈ మూడేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక ఎత్తుపల్లాలను చూసింది.

అనుకూల, ప్రతికూలతలు

పంచ గ్యారెంటీ పథకాలు, బెంగళూరు అభివృద్ధికి పెద్దపీట, మెట్రో రైలు విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణలో గణనీయ ప్రగతిని సాధించినట్లు ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. అయితే జిల్లాల్లో అభివృద్ధిలో వెనుకంజ, ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ యువత ఉద్యమించడం, కులగణన నివేదికను అటకెక్కించడం, ముఖ్యమంత్రి కుర్చీ కోసం కలహాలు, ఢిల్లీలో పంచాయతీలు, కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు వంటివి సర్కారుకు ముళ్లుగా మారాయి.

నేడు సాధన సభ: హోంమంత్రి

తుమకూరు: సిద్దరామయ్య సర్కారు మూడేళ్ల సాధన సభ నేడు మంగళవారం తుమకూరులో జరుగుతుందని హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. సభ జరిగే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో ఏర్పాట్లను మంత్రి పరిశీలించి మాట్లాడారు. మూడేళ్లలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేసేందుకు ఈ సాధన సభ జరుపుతున్నట్లు చెప్పారు. తుమకూరు జిల్లా రెవెన్యూ శాఖ సాధనలను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఈ సందర్భంగా నమోదు చేస్తారని, గిన్నిస్‌ ప్రతినిధులు ఇంగ్లాండ్‌ నుంచి వచ్చారని తెలిపారు. తుమకూరు జిల్లాలో రికార్డుస్థాయిలో 1,52,492 మందికి భూ హక్కు పత్రాలను అందించినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని తాలూకాల నుంచి సుమారు 3 వేల బస్సులను ఏర్పాటు చేశామన్నారు. భారీగా పోలీసు బందోబస్తును, 15 అంబులెన్స్‌లను, వైద్య సిబ్బందిని సిద్ధం చేసినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement