పిడుగు శబ్ధానికి హెచ్‌ఎం మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగు శబ్ధానికి హెచ్‌ఎం మృతి

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

దొడ్డబళ్లాపురం: పిడుగుపాటుకు గుండె ఆగి ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా మలెకుంబళూరు గ్రామంలో జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం నాగరాజప్ప (56) మృతుడు. ఆదివారం రాత్రి జోరువాన కురిసింది. నాగరాజప్ప ఇంటి ముందు నిలబడి ఉండగా సమీపంలోనే పిడుగు పడింది. ఈ భీకర శబ్దానికి ఆయన గుండె ఆగి కుప్పకూలి మరణించారు. హొన్నాళి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఊపిరి తీసిన ఉసిరి

మాలూరు: పసిబాలుడు ఉసిరికాయతో ఆటలాడుతూ నోట్లో పెట్టుకోగా గొంతులో చిక్కుకుంది. విలవిలలాడుతూ చనిపోయాడు. ఈ విషాద ఘటన కోలారు పట్టణంలోని గాంధీ నగర్‌లో జరిగింది. వివరాలు.. రవి, మాలా దంపతుల కుమారుడు విజయేంద్ర (2). ఇంట్లో ఆడుకుంటూ నేలపై పడిన ఉసిరి కాయను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో చిక్కుకుంది. తల్లిదండ్రులు చూసి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు గొంతులో చిక్కుకున్న ఉసిరికాయను బయటకు తీసేసరికి బాలుడు మరణించాడు. కళ్ల ముందే కుమారుడు దూరం కావడంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది.

దళపతి 94వ పుట్టినరోజు

పోరాటం చేస్తూనే ఉంటానని వెల్లడి

శివాజీనగర: జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌.డీ.దేవేగౌడ సోమవారం 94వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొన్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. సతీమణి చెన్నమ్మతో కలసి బెంగళూరు జేపీ నగరలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అసమానమైన సేవలు అందించారని, దేవుని దయతో మరింతకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని పేర్కొన్నారు.

బీజేపీతో పొత్తుతోనే ఎన్నికలకు

తన చేతనైన వరకు రాష్ట్ర సమస్యలపై ప్రజల కోసం పోరాటం చేస్తానని దేవేగౌడ తెలిపారు. 68 సంవత్సరాలుగా రాజకీయ పోరాటం చేస్తూ వచ్చాను, ఎలాంటి క్లిష్ట సమస్య వచ్చినా పరిష్కరించుకొంటాననే దృఢ విశ్వాసముందని ఆయన తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో పొత్తు ఉంటుందని, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో సత్సంబంధాలు ఉన్నాయని, ఎలాంటి సమస్యా రాదని చెప్పారు. దక్షిణాన కేరళ, తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ఉందని, మునుముందు ఏమి జరుగుతుందోనని వేచి చూడాలని అన్నారు.

హైవేలో డివైడర్‌కు కారు ఢీ

తల్లీ, కుమార్తె దుర్మరణం

తుమకూరు: రోడ్డు డివైడర్‌ను కారు ఢీ కొట్టిన ప్రమాదంలో తల్లీకూతురు మరణించారు. ఈ ఘటన జిల్లాలోని కుణిగల్‌ తాలూకా లాళపుర వద్ద హైవే– 75లో సోమవారం జరిగింది. బెంగళూరుకు చెందిన జయమాల (59), ఆమె కుమార్తె రాజేశ్వరి (42) మరణించారు. వీరు రాయచూరుకు చెందిన వారు కాగా కొన్నేళ్లుగా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. రాజేశ్వరి కుమారుడు ప్రీతంను శ్రావణ బెళగొళలోని పాఠశాలలో చేర్పించేందుకు బెంగళూరు నుంచి తుమకూరుకు రైలులో వచ్చారు. తమ బంధువు మహావీర్‌తో కారులో శ్రావణ బెళగొళకు బయలుదేరారు. వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొనడంతో మహిళలు మరణించగా, మహావీర్‌, ప్రీతంకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో హైవేలో కొన్ని గంటలపాటు రాకపోకలకు ఆటంకం కలిగింది. కుణిగల్‌ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement