రాజధానిలో జడివాన | - | Sakshi
Sakshi News home page

రాజధానిలో జడివాన

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

బనశంకరి: బెంగళూరు నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం మెజస్టిక్‌, కేఆర్‌.మార్కెట్‌, టౌన్‌హాల్‌, కార్పోరేషన్‌, శాంతినగర, వసంతనగర, సదాశివ నగరతో పాటు నగర నడిబొడ్డున జడివానతో రోడ్లు, కూడళ్లు జలమయం అయ్యాయి. సరిగ్గా ఉద్యోగులు ఆఫీసుల ఉంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వాన రావడంతో తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో రాత్రి వరకూ ఎడతెరపి లేకుండా వాన పడింది. దక్షిణ, ఈశాన్య ప్రాంతాలైన హెబ్బాళ, యలహంక, గిరినగర, బసవనగుడి, జయనగర, జేపీ.నగర, బనశంకరి, కోణణకుంటె పరిధిలో వర్షం కురిసింది. గాలులకు కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడటంతో సంచారానికి ఇబ్బంది ఏర్పడింది.

మరింతగా వర్షసూచన

ముంపు ప్రమాదం ఉన్నందున కేఆర్‌ సర్కిల్‌ అండర్‌పాస్‌ను అధికారులు మూసివేశారు. అటు ఇటు బ్యారికేడ్లను అమర్చి వాహనాలను మళ్లించారు. శివానంద సర్కిల్‌ అండర్‌పాస్‌లో నీరు నిలవడంతో పాత రేస్‌కోర్సు రోడ్డు నుంచి శేషాద్రిపురం వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌ మీద తీవ్ర రద్దీ ఏర్పడింది. తొలకరి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ శాస్త్రవేత్త సీఎస్‌.పాటిల్‌ తెలిపారు. కరావళి, మలెనాడు, ఒళనాడు జిల్లాల్లో సాదారణం కంటే భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. పలు జిల్లాలకు ఉరుములు, పిడుగులతో కూడిన వర్ష ఉధృతి పెరుగుతుందన్నారు.

సాయంత్రం నుంచి

రాత్రి వరకూ వర్షం

తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు

Advertisement
 
Advertisement
Advertisement