హొసపేటె: పురావస్తు ప్రదేశాల పరిరక్షణ ప్రతి ఒక్కరి ప్రాథమిక కర్తవ్యం కావాలని హంపీ పురావస్తు శాఖ సూపరింటెండెంట్ కే.రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం కమలాపూర్ మ్యూజియంలో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలు ప్రాథమిక హక్కుల గురించి మాత్రమే మాట్లాడతారని.. వారి ప్రాథమిక కర్తవ్యాలపై దృష్టి పెట్టరని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన హంపీ చుట్టూ తగినన్ని పురావస్తు ప్రదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో కన్నడ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ విరుపాక్షి పూజారిహళ్లి, విరుపాక్షేశ్వర ప్రీ–యూనివర్సిటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బసవరాజ్ ఎమ్మిగనూరు, జేఎస్‌డబ్ల్యూ పంకజ్‌కుమార్, మహమ్మద్ అమర్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సిబ్బంది డాక్టర్.దేవరాజు ఎస్.ఎం.డాక్టర్ కేసీ ప్రేమ, డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
భూముల పంపిణీ చేపట్టాలి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదలకు వెంటనే భూములు పంపిణీ చేయాలని భూమి వసతి హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం టిప్పు సుల్తాన్ ఉద్యాన వనంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచాలకుడు మారెప్ప మాట్లాడుతూ.. గోమాళ, గైరాణ, పరంబోకు, ఖరాబ్, అటవీ భూ బ్యాంక్ నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, సన్న, చిన్నకారు రైతులకు సర్కార్ మిగులు భూములు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం స్థానిక అధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆంజనేయ, రంగారెడ్డి, నరసింహులు, గోవింద, జిందమ్మ,అంబమ్మలున్నారు
నియామకం
హొసపేటె: అఖిల భారత వాల్మీకి నాయక సంఘం జాతీయ అధ్యక్షుడిగా హొసపేటెకు చెందిన గుజ్జల నాగరాజ్ ఎన్నికయ్యారు. ఇటీవల అఖిల భారత వాల్మీకి నాయక సంఘం కార్యవర్గ సమావేశం ఢిల్లీలోని జనకపురిలో ఉన్న జాతీయ కార్యాలయంలో జరిగింది. నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. విజయనగర జిల్లాకు చెందిన న్యాయవాది గుజ్జల్ నాగరాజును నూతన జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సెక్యూరిటీ గార్డు దారుణ హత్య
రాయచూరు రూరల్: ఇనుప రాడ్‌తో కొట్టి సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేసిన ఘటన కలబుర్గి జిల్లాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కలబుర్గిలోని ఇండియన్ ఆయిల్ కంపెనీలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు రవిచంద్ర ఖేడ్ (45) హత్యకు గురైన వ్యక్తి. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఉన్న రవిచంద్ర ఖేడ్‌ను బయటకు పిలిచి, రామ మందిరం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఏమి జరిగింది ఏమో తెలియదు కాని.. ఇనుప రాడ్‌తో కొట్టి రవిచంద్ర ఖేడ్‌ను హత్య చేశారు. కలబుర్గి పోలీస్ కమిషనర్ శరణప్ప ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వ పథకాలు అందాలి
రాయచూరు రూరల్: జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. అలాగే అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారి పూవిత తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ శాఖ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు కూడా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూముల ఆక్రమణపై విచారించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టాల్లో తేడాలు, సవరణ, భూముల హక్కు పత్రాలు, సర్వేలు, అక్రమ ఇసుక రవాణా తదితర వాటిపై నిఘా పెట్టాలని తెలిపారు. ప్రజల సమస్యలను ఓపికగా విని, సమర్థవంతంగా పని చేయడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.


