● మహిళా కానిస్టేబుల్ సహా
8 మందికి గాయాలు
హొసపేటె: గంగావతి తాలూకాలోని ఒక రిసార్ట్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఆదివారం సాయంత్రం చిన్న విషయంలో జరిగిన ఘర్షణలో మహిళా కానిస్టేబుల్ సహా 8 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో కొప్పళకు చెందిన మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, ఆమె మెడలోని బంగారం గొలుసు లాక్కున్నారు. వివరాలు.. తాలూకాలోని చిక్క జంతకల్ గ్రామం నుంచి రిసార్ట్‌కు వచ్చిన మహిళలతో సహా 8 మంది వ్యక్తుల బృందం స్విమ్మింగ్ పూల్‌లోకి దిగింది. అదే సమయంలో, గంగావతి నుంచి వచ్చిన కొందరు యువకులు నీళ్ల సీసాలు విసిరి గొడవకు దిగారు. ఆ తర్వాత అంజనాద్రి సమీపంలో మాటల యుద్ధం జరిగి వారు గొడవకు దిగారు. ఈ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్‌ను కొట్టారు. ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఇన్‌చార్జ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్‌పీ) సిద్దలింగప్ప గౌడ, రూరల్ పోలీస్ స్టేషన్ సీపీఐ రంగప్ప దొడ్మణి, గంగావతి నగర్ పోలీస్ స్టేషన్ పీఐ ప్రకాష్ యతానూర్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘటనపై విచారణ జరిపారు.
ఇద్దరు దొంగలు అరెస్ట్
రాయచూరు రూరల్: బెళగావి జిల్లా అణి బస్టాండ్‌లో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి, రూ.1.26 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నట్లు అథణి డీఎస్పీ పి.రాజేంద్ర వెల్లడించారు. సోమవారం సాయంత్రం అథణి బస్టాండ్‌లో చోరీ చేస్తున్న సమయంలో కోల్హాపూర్‌కు చెందిన హేమ, నీలం కాంబ్లేను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఉచిత వైద్య శిబిరం
రాయచూరు రూరల్: నగరంలోని ఆజాద్ నగర్‌లో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విజి కులకర్ణి ఆస్పత్రి వైద్యుడు డా.అజిత్ కులకర్ణి మాట్లాడుతూ.. ప్రజలు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దాదాపు 200 మందికి బీపీ, షుగర్, మధుమేహం, గుండెపోటు, ఇతర వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు.
నరేగా కార్మికులకు వైద్య పరీక్షలు
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా హీరాపూర్‌లో సోమవారం నరేగా (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం) కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌ఈసీ అధికారి ధన్‌రాజ్ సూచించారు. అనంతరం వైద్యులు బీపీ, షుగర్, తదితర వైద్య పరీక్షలు చేశారు.
పాఠశాల విలీనంపై ఆగ్రహం
బళ్లారి టౌన్: బళ్లారి తాలూకా కొర్లగుంది గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ ప్రాథమిక పాఠశాలను కేపీఎస్ పాఠశాలకు విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో స్థానిక విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల విలీనం వద్దని ప్రధాన ఉపాధ్యాయులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐడీఎస్‌ఓ నేతలు నాగరత్న తదితరులు మాట్లాడుతూ.. కొర్లగుంది గ్రామంలో 100 మందికి పైగా పేద విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నారన్నారు. ఈ పాఠశాలను కేపీఎస్‌లో విలీనం చేస్తు పాఠశాలను మూసివేసే దిశగాప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేపీఎస్ మ్యాగినీట్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్రంలో పలు పాఠశాలలను మూసి వేసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో స్థానిక నేతలు గాదిలింగ, సోమశేఖర్, ఎస్‌డీఎం అధ్యక్షుడు వీరేశ, ప్రసన్న, శివప్ప, చంద్రశేఖర్, గోపాల, కుమార్, సోమ, శాంతమ్మ, సుమంగళమ్మ, హేమావతి, శ్యామల, శివమ్మ, మారుతీ ప్రసన్న పాల్గొన్నారు.
ఇద్దరికి కుక్క కాటు
రాయచూరు రూరల్: నగరంలో కుక్కల స్వైర విహారం అధికమైంది. వీధుల్లో గుంపులుగా తిరుగుతూ యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నాయి. సోమవారం నగర పరిధిలోని యరమరాస్, ఎల్‌బీఎస్ నగర్‌లో ఇద్దరు పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు పిల్లలను చికిత్స నిమిత్తం సర్కారు ఆస్పత్రిలో చేర్పించారు. ఇదిలా ఉండగా నగరంలో ఎక్కడ పడితే అక్కడ కుక్కలు సంచరిస్తున్నాయి. వీధి కుక్కల తరలింపులో నగర సభ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా స్పందించి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.


