బళ్లారి అర్బన్: గత ఐదేళ్లలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్య, మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వైస్ చాన్సలర్ మునిరాజ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎస్‌ఆర్ నిధులతో జిమ్ గది, క్యాంటీన్ నిర్మించామని చెప్పారు. రూ.23 కోట్ల వ్యయంతో మల్టీ యుటిలిటీ కాంప్లెక్స్ నిర్మించి, ఆస్పత్రి, బ్యాంకు, ఏటీఎం, జిరాక్స్ సెంటర్ సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. గవర్నర్ గ్రాంట్ ద్వారా రూ.42 కోట్లతో విశ్వవిద్యాలయాన్ని సౌరశక్తి ఆధారితంగా మార్చామని వెల్లడించారు. దీని వల్ల ప్రతి నెలా విద్యుత్ ఖర్చు ఆదా అవుతోందన్నారు. స్మార్ట్ క్లాస్‌రూమ్స్, కొత్త ఆడిటోరియం, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. క్యాంపస్ టు కేరీర్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మెడికల్ ఫిజిక్స్ సహా పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టామని తెలిపారు. విద్యార్థుల కోసం కొత్త స్టేడియం నిర్మించడంతో పాటు జర్నలిజం విభాగానికి కెమెరా, డ్రోన్ అందజేసినట్లు వెల్లడించారు. ఎన్‌ఎమ్‌డీసీ సహకారంతో రూ.1.5 కోట్ల వ్యవయంతో భోజన శాల నిర్మాణం జరుగుతోందని.. వచ్చే నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. అంబేడ్కర్ స్టడీ సెంటర్‌లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశ్వవిద్యాలయంలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. కార్యక్రమంలో సాలి, లోకేష్ పాల్గొన్నారు.


