బళ్లారి అర్బన్: అంతర్గ రిజర్వేషన్ అమలులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని మాదిగ రిజర్వేషన్ల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.హనుమంతప్ప ఆరోపించారు. సోమవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న అంతర్గ రిజర్వేషన్లు నిర్ణయాలను అమలు చేయకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తుందన్నారు. దళితులపై చిత్తశుద్ది ఉంటే నాగమోహన్ దాస్ నివేదికను ఇప్పటికే అమలు చేసి ఉండాల్సి ఉందని గుర్తు చేశారు. ఏసీపీ, టీఎస్పీ నిధులను గ్యారెంటీ పథకాల కోసం వినియోగిస్తున్నారని తెలిపారు. దళితుల సంక్షేమంపై కాంగ్రెస్‌కు శ్రద్ధ లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అంతర్గ రిజర్వేషన్ల నిర్ణయంపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం బాధకరమన్నారు. రిజర్వేషన్ అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల అమలుపై నెలకొన్న గందరగోళాన్ని వెంటానే నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోకా అనిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


