సాక్షి, బెంగళూరు: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని సీసాసై రాసి ఉంటుంది. కానీ అనేక రకాలుగా కూడా అది అపాయకారే. ముఖ్యంగా మద్యం మహమ్మారి పచ్చని సంపారాలను కూల్చేస్తోంది. కైపులో తన మన తేడా లేకుండా దౌర్జన్యాలకు పాల్పడుతూ అశాంతిని రేకెత్తిస్తున్నారు. మద్యం వల్ల కుటుంబాల్లో దాడులు జరుగుతున్న కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కట్టుకున్న భార్య, తల్లిదండ్రులు, తోబుట్టువులు అనే తేడా లేకుండా మందుబాబులు విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో అబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం 11 శాతం మంది మద్యపాన వ్యసనులుగా ఉన్నట్లు తెలిసింది. ఇందులో 71 శాతం మంది భార్యలపై దాడులకు పాల్పడుతున్నట్లు కూడా గణాంకాలు చెబుతున్నాయి. బెంగళూరు నిమ్హాన్స్ సంస్థ కూడా గతంలో అధ్యయనంలో తెలిపింది.
అన్నింటికీ చుక్కే కారణం
మద్యపానం వల్ల సామాజికంగా ఏర్పడుతున్న పరిణామాలపై అవగాహన కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఇందులోని చేదు నిజాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మద్యం తాగి వెళ్లి భార్యలపై దాడులకు ఒడిగడుతున్నట్లు తెలిసింది. దేశంలో అత్యధికంగా మద్యం అమ్ముడయ్యే రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఆర్థిక వనరుగా ఈ మద్యం విక్రయాలు మారినప్పటికీ సామాజికంగా సమస్యగా తయారైంది. కుటుంబాల్లో శారీరక హింస, గొడవలు, ఆర్థిక ఇబ్బందులకు మద్యమే ప్రధాన కారణమని నివేదికలో పేర్కొన్నారు.
మైనర్లకూ అలవాటు
రాష్ట్రంలో 15 ఏళ్లు, అంతకుమించి వయసు కలిగిన వారిలో మద్యం సేవించే వారు 8.62 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో తలసరి మద్య సేవనం ఏటా 9.1 లీటర్లుగా ఉంది. అలాగే 15–49 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో సుమారు 16.5 శాతం మంది మద్యాన్ని సేవిస్తుండగా, 0.9 శాతం మంది మహిళలు సైతం అలవాటు చేసుకున్నారు.
మద్యపానం వల్ల సంసారాల్లో
తీవ్ర గొడవలు
అబ్కారీ శాఖ సర్వేలో చేదు నిజాలు
రాష్ట్రంలో 11 శాతం మంది మద్యానికి బానిసలు


