శ్రీరాజరాజేశ్వరీ నమోస్తుతే | - | Sakshi
Sakshi News home page

శ్రీరాజరాజేశ్వరీ నమోస్తుతే

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

కోలారు: తాలూకాలోని వక్కలేరి గ్రామంలో ఆదివారం శ్రీరాజ రాజేశ్వరి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం చండికా హోమం, సర్పదోష నివారణ, అశ్లేష పూజ, అమ్మవారికి విశేష అలంకారం తదితరాలను నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహించారు. వేలమంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు.

ఎయిర్‌పోర్టులో

రూ.7 కోట్ల గంజాయి సీజ్‌

దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీ మొత్తంలో హైడ్రోఫోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లగేజ్‌ బ్యాగుల్లో రహస్యంగా దాచి ఉంచిన 20 కేజీల హైడ్రోఫోనిక్‌ గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.7.12 కోట్లుగా తెలిపారు. వారిని అరెస్టు చేశారు.

బాలికపై అత్యాచారం, హత్య?

కోలారు జిల్లాలో ఘటన

కోలారు: కనిపించకుండా పోయిన బాలిక నీటికుంటలో శవంగా తేలింది. ఈ ఘటన తాలూకాలోని హరటి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బాలిక (15) 3 రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు కోలారు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పొరుగింటి ఆనంద్‌ అనే యువకునిపై అనుమానం వ్యక్తం చేశారు, బాలిక అత్తమామల ఇంట్లో ఉండి 9వ తరగతి చదువుకుంటోంది. ఇప్పుడు పదో తరగతికి వెళ్లాల్సి ఉంది. శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని ఓ పొలంలో ఫారంపాండ్‌లో శవం ఉన్నట్లు పోలీసులకు తెలిసి వెళ్లారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. ఫైర్‌ సిబ్బంది శవాన్ని వెలికి తీసి పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రియల్టర్‌కు బెదిరింపులు

యశవంతపుర: బెంగళూరు విద్యారణ్యపురకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి అండర్‌వల్డ్‌ డాన్‌ విక్కి శెట్టి పేరున బెదిరింపు వచ్చింది. అడిగినంత ఇవ్వకుంటే నీ కొడుకును పెళ్లి రోజునే లేపేస్తామని బెదిరించారని బాధిత రియల్టర్‌ శంకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏప్రిల్‌ 21న మొదట ఓ కాల్‌ చేసి బెదిరించారు, తాను పట్టించుకోలేదని, మళ్లీ మరో నంబర్‌ నుంచి కాల్‌ చేసి డబ్బులను డిమాండ్‌ చేశారు. పదేపదే కాల్స్‌ రావడంతో స్విచాఫ్‌ చేశానని తెలిపాడు. నిజంగా విక్కీశెట్టి వర్గీయులు కాల్‌చేశారా, లేక వ్యాపారంలో పోటీదారులు ఈ పనిచేశారా? అనేది విద్యారణ్యపుర పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, మంగళూరుకు చెందిన విక్కి శెట్టి మోస్ట్‌ వాంటెండ్‌ అండర్‌వరల్డ్‌ నేరగాళ్లలో ఒకరు, 20 ఏళ్ల నుంచి విదేశాలలో తలదాచుకున్నాడు. అతని అరెస్ట్‌కు సీబీఐ రెడ్‌కార్నర్‌ నోటీసులు కూడా జారీ చేసింది. దుబాయ్‌, దక్షిణ ఆఫ్రికాలో నివాసం ఉంటాడని సమాచారం.

వంతెన పైనుంచి కారు పల్టీ

నలుగురికి తీవ్ర గాయాలు

కోలారు: నిర్మాణ దశలో ఉన్న అండర్‌పాస్‌ సర్వీస్‌ రోడ్డుపై నుంచి కారు కింద పడి బాలునితో పాటు నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన ముళబాగిలు తాలూకా నరసింహ తీర్థ అండర్‌పాస్‌ వద్ద జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి కారులో వెళుతున్న కుటుంబం ఆదివారం తెల్లవారున 3 గంటలప్పుడు ఘటనాస్థలికి రాగానే అదుపు తప్పి కింద పడింది. నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ముళబాగిలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement