ఓ తండ్రి కిరాతకం.. కూతురి పరువు హత్య | - | Sakshi
Sakshi News home page

ఓ తండ్రి కిరాతకం.. కూతురి పరువు హత్య

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

తుమకూరు: పరువు హత్యలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర సర్కారు ఏకంగా చట్టాన్ని తెచ్చినా దుండగులు వెనకడుగు వేయడం లేదు. కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటూ ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కన్నతండ్రే కాలయముడై ప్రాణాలు బలిగొన్నాడు. ఈ ఘటన తుమకూరు శిర తాలూకా నింబెమరదహళ్లిలో జరిగింది. మేఘన (17) అనే అమ్మాయిని ఆమె తండ్రి తిమ్మరాయప్ప (48) దారుణంగా హత్య చేశాడు. తనకు ఇష్టం లేకుండా భార్య తరఫు బంధువుతో పెళ్లికి కూతురు సిద్ధమైందని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

పెళ్లికి ఒప్పుకుందని గొడవ

వివరాలు.. తిమ్మరాయప్ప, నిర్మల దంపతులు కూలీ పనులు చేస్తుంటారు. వీరి కూతురు మేఘన. తల్లి మేఘనకు తమ బంధువుల అబ్బాయితో పెళ్లి కుదిర్చింది. వరుని కుటుంబ సభ్యులు పెళ్లి కోసం చీరలు, తాళి తదితర వస్తువులు కొనుగోలు చేశారు. ఈ పెళ్లి తండ్రికి ఇష్టం లేదు, దీంతో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉండేవి. కూతురును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల రోజులుగా మేఘన కనిపించడం లేదు. దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురి కోసం ఘరానా తండ్రి విలపిస్తూ రక్తి కట్టించాడు.

బావిలోకి తోసి.. రాయి వేసి..

తిమ్మరాయప్ప మీద అనుమానం బలపడిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా నోరు విప్పాడు. ఏప్రిల్‌ 16న కుమార్తెను తానే చంపినట్లు కిరాతకుడు అంగీకరించాడు. నిర్మల కూలీ పనులకు వెళ్లగా, ఇంట్లో ఒక్కతే ఉన్న కూతురికి మాయమాటలు చెప్పి ఊరిబటయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఆమెను బావిలోకి తోశాడు. మళ్లీ బయటకు వస్తుందేమోనని బండరాయి తీసి ఆమె మీదకు వేశాడు. ఇలా హత్య చేశాక, మృతదేహాన్ని బయటకు తీసి దగ్గర్లో పాతిపెట్టినట్లు చెప్పాడు. ఆ రోజు సాయంత్రం తల్లి ఇంటికి వచ్చాక కూతురు కనబడలేదు. ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. దీంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి కనబడడం లేదని ఫిర్యాదు చేసింది. తిమ్మరాయప్ప కూడా ఠాణాకు వచ్చాడు. కిరాతకున్ని అరెస్టు చేశారు.

ఇష్టం లేని పెళ్లికి సిద్ధమైందని దారుణం

తుమకూరు జిల్లాలో ఘటన

నెల రోజుల తరువాత నేరం గుట్టురట్టు

Advertisement
 
Advertisement
Advertisement