సాక్షి, బళ్లారి: పట్టణ పేదలు, శ్రామికులకు సరసమైన ధరలకు రాయితీపై పౌష్టికాహారాన్ని (టిఫిన్, భోజనం) ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఇందిరా క్యాంటీన్లు బళ్లారి నగరంలో మూతపడిపోతున్నాయి. వినియోగదారుడు కేవలం రూ.5 అల్పాహారానికి, రూ.10 భోజనానికి చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, తాలూకా కేంద్రాలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇవి పని చేస్తున్నాయి. పేదలు, కూలీలు, కార్మికులు ఆకలి తీర్చేందుకు ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్ల నిర్వహణ ప్రస్తుతం అధ్వానంగా తయారైంది. బళ్లారి నగరం మోతీ సర్కిల్ సమీపంలోని బుడా ఆవరణ, ఏపీఎంసీ కూరగాయల మార్కెట్, బాపూజీ నగర్, బెళగల్ క్రాస్, టీబీ శ్యానిటోరియం, జిల్లా ఆస్పత్రి తదితర జన సంచారం ఎక్కువగా ఉన్న ఏడు ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ప్రారంభంలో ఇందిరా క్యాంటీన్లు బాగా పని చేసినా.. కాలక్రమేణ నిర్వహణను గాలికొదిలేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ క్యాంటీన్లను పునరుద్ధరించాలని, పేదలకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. బడ్జెట్లో నిధులు కేటాయించి, అవసరమైన ప్రాంతాల్లో కొత్త క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో మూడపడిపోతున్నాయి. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు అప్పులు చేసి క్యాంటీన్లు నడిపారు. అయితే బకాయిలు పేరుకుపోవడంతో చేతులెత్తేశారు. ఒక్క బళ్లారి నగరంలోనే 7 ఇందిరా క్యాంటీన్లు ఉండగా.. 8 నెలలకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉంది. నెలకు ఒక్కో ఇందిరా క్యాంటీన్‌కు సుమారు రూ.20 లక్షల వ్యయం అవుతుంది. ఆ లెక్కన బళ్లారిలో 7 ఇందిరా క్యాంటీన్లు ఉండగా 8 నెలలకు సంబంధించి రూ.కోటిన్నర వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంది. అక్కడ పని చేసిన సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించ లేదు. అప్పులు చేసిన క్యాంటీన్లు నడిపిన కాంట్రాక్టర్లు బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు.
బకాయిలు చెల్లించకపోవడంతో
చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
బళ్లారిలో ఏడు బంద్
అధికారులు, పాలకుల అలసత్వంతో
8 నెలలుగా ఇదే పరిస్థితి
పేదలపై తీరని భారం
అధ్వానంగా మారిన నిర్వాహణ
బకాయిల గుదిబండ
బళ్లారి నగరంలో రోజూ సుమారు 500 నుంచి 1000 మంది వరకూ ఇందిరా క్యాంటీన్లను ఆశ్రయించే వారు. సరసమైన ధరలకు టిఫిన్, భోజనం అందడంతో క్యాంటీన్లకు పరుగులు పెట్టేవారు. ప్రస్తుతం బళ్లారిలో మొత్తం 7 ఇందిరా క్యాంటీన్లు మూతపడి పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. క్యాంటీన్లు తెరవాలని నిర్వాహకులను అడిగితే నిధుల కొరత కారణంగా మూసేస్తున్నట్లు చెబుతున్నారు. బయట హోటళ్లలో ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఇందిరా క్యాంటీన్లు మూతపడటం పేదలకు శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓ వైపు పశ్చిమాసియాలో యుద్దం కారణంగా ఇప్పటికే గ్యాస్ ధరలు పెంచడంతో పాటు, పలు హోటళ్లు మూతపడగా.. ధరలు కూడా పెంచారు. హోటల్‌లో టిఫిన్ చేయాలంటే కనీసం రూ.50కి పైగా చెల్లించాల్సిందే. ఇక భోజనం అంటే కనీసం రూ.100లు వరకు ఉంటుంది. క్యాంటీన్ల సమస్యలపై స్థానిక పాలకులు, అధికారలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గ్యారెంటీలు అమలు చేయడానికి పలు పథకాలకు కోతలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇకనైనా సంబంధిత అధికారులు, పాలకులు మూతపడిన ఇందిరా క్యాంటీన్లు తెరిపించి పేదలకు భోజనం అందేలా చూడాల్సిన అవసరం ఉంది.


