రాయచూరు రూరల్: నగరంలో మైనార్టీలు విద్యా రంగంలో ముందుండాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. నగరంలోని ప్రిన్స్ ఫాతిమా కళాశాలలో రూ.50 లక్షలతో నూతన తరగతి గదుల నిర్మాణాలకు ఆదివారం ఆయన భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రిన్స్ ఫాతిమా జీవిత చరిత్ర అందరూ తెలుసుకోవాలన్నారు. మానవతా ధర్మం ఆధారంగా ఆమె చేసిన సేవలు అనన్యమన్నారు. కార్యక్రమంలో శాలం, రుద్రప్ప అంగడి, దరూరు బసవరాజ్, శాంతప్ప, జయణ్ణ, నాసిర్ అహ్మద్, శంశుద్దీన్, నరిసింహులు, ఫిరోజ్, అమరే గౌడ, రమేష్, తిమ్మప్ప, యూనస్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
పది, ఇంటర్
విద్యార్థులకు సన్మానం
రాయచూరు రూరల్: సమాజంలో విద్యార్థులు మానవీయ మౌల్యాలను పెంచుకోవాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. ఆదివారం వీరశైవ కళ్యాణ మంటపంలో గాణిగ సమాజం ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరంలో ఉత్తమ శ్రేణిలో పాసైన పది, ఇంటర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పచ్చని నగరం, ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సోమవారిపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, గాణిగ సమాజం అధ్యక్షుడు చెన్నప్ప సజ్జన్, సిద్రామప్ప, శకుంతల, లక్ష్మీబాయి, బసప్ప గోరేబాళ్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
రాయచూరు రూరల్: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ క్రీడా మైదానంలో పాత్రికేయుల సంఘం, పోలీస్ అధికారుల సంఘం మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించారు. క్రీడల్లో గెలుపు, ఓటమిని అందరూ సమానంగా స్వీకరించాలని సూచించారు. పోలీస్ జట్టుపై పాత్రికేయుల జట్టు విజయం సాధింరచింది. కార్యక్రమంలో పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు గురునాథ్, కార్యదర్శి సిద్ధయ్య, విజయ్ జాగటకల్, అదనపు ఎస్పీలు కుమార స్వామి, హరీష్, డీఎస్పీ శాంతవీర, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ‘గురువందన’
హొసపేటె: హొసపేటె తాలూకా, కమలాపురలో ఆదివారం గురువందన, మహాస్నేహ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమలాపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తోప్పల్ చన్నప్ప పాఠశాల, సిద్దేశ్వర్ పాఠశాల, హంపీ ప్రాథమిక పాఠశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. గురు బ్రహ్మ, గురువిష్ణు, గురు మహేశ్వర్ అని గంట మోగిస్తూ 9 మంది గురువులను వేదికపైకి తీసుకొచ్చి సన్మానించారు. బాల్యంలో జరిగిన సంఘటలు, మధుర జ్ఞాపకాలను పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు.
విచారణ జరపాలి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కేంద్ర సహకార (ఆర్‌డీసీసీ)లో గతంలో జరిగిన నియామకాల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. వాటిపై విచారణ జరపాలని దళిత సంఘర్ష సమితి సంచాలకుడు రవీంద్ర నాథ్ పట్టి డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో చేపట్టిన నియామకాలను రద్దు చేసి మళ్లీ పోస్టులు భర్తీ చేయాలని సూచించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సర్కార్ ముందుకు రావాలన్నారు. బ్యాంక్ నియామకాలకు కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలు రావడం జరిగిందన్నారు.


