హుబ్లీ: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైక్‌లో వెళుతున్న ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన సవదత్తి తాలూకా హులికట్టి గ్రామం వద్ద చోటు చేసుకుంది. నరగుంద దండాపుర వీధి నివాసులైన ప్రశాంత (25), నింగప్ప (28), లోకేష్ (28) మృతులు. మునవళ్లి నరగుంద రోడ్డు హెక్కేరి కరియమ్మ దర్శనం చేసుకుని తిరిగి నరగుందకు ముగ్గురు ఒకే బైక్‌లో బయలుదేరారు. నరగుంద నుంచి మునవళ్లి వైపు వస్తున్న భారీ వాహనం హులికట్టి వద్ద బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత, నింగప్ప స్థలంలోనే మృతి చెందారు. లోకేష్ ఆస్పత్రిలో చికిత్స ఫలించక మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై సవదత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీ అయిన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
‘జై శ్రీరామ్ అని చెప్పండి’
హుబ్లీ: ‘జూన్‌లో పాఠశాలలు ప్రారంభం అయ్యాక ప్రతి ఒక్కరికీ కేసరి శాలువాలు పంపిణీ చేస్తాను. ఇక ముందు పాఠశాలలో హాజరు పలికే వేళ ఎస్ సార్ అనే దానికి బదులుగా జై శ్రీరామ్ అని చెప్పాలి. ఉపాధ్యాయులకు నమస్కరించేటప్పుడు జై శ్రీరామ్ అని చెప్పండి’ అని ఎమ్మెల్యే బసవన గౌడ పాటిల్ యత్నాళ్ సూచించారు. ఆదివారం విజయపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా సంస్థల్లో పునర్ హిజాబ్ ధరించడానికి అవకాశం కల్పించడంపై మండిపడ్డారు. కేసరి శాలువా ధరించడంపై నిషేధం విధించేందుకు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చింది ఎవరు? కేసరి శాలువా ధరించే హక్కు మాకు ఉందని తెలిపారు. హిందూ పోషకులందరూ తమ పిల్లలకు తిలకం దీద్ది కేసరి శాలువా కప్పి స్కూల్‌కు పంపాలని సూచించారు.
బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
రాయచూరు రూరల్: సమాజంలో బడుగు, దళిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని అంజుమన్ సంస్థ అధ్యక్షుడు అన్సరుద్దీన్ అభిప్రాయపడ్డారు. శనివారం రాత్రి లింగసూగురులో అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ బాటలో అందరూ పయనించాలని సూచించారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలన్నారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన పది, ఇంటర్ విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో హుసేన్ పాషా, రహీం, రసూల్, అస్లాం, అరిఫ్, యాసిన్, మజీబాబు, రాజ్ మహ్మద్ పాల్గొన్నారు.
రాయచూరు వాసి మృతి
చిలమత్తూరు: మండల పరిధిలోని 44 వ నంబర్ జాతీయ రహదారి కొడికొండ చెక్‌పోస్ట్ గంగోత్రి డాబా వద్ద 7 హిల్స్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని మైసూరుకు చెందిన ప్రకాష్ (60) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాయచూరు నుంచి ప్రకాష్ బెంగళూరుకు బయలుదేరాడు. టీ తాగేందుకు బస్సు గంగోత్రి డాబా వద్ద ఆపారు. ప్రకాష్ రోడ్డు అవతలి వైపు మూత్ర విసర్జన కోసం వెళ్లే క్రమంలో బెంగళూరు నుంచి హైదరాబాదు వెళుతున్న బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు బస్సును సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
ఆవుల పంపిణీ
శ్రీనివాసపురం: శ్యాగత్తూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో రోటరీ సంస్థ నుంచి 150 ఆవులను మహిళలకు ఉచితంగా అందించారు. రోటరీ జిల్లా గవర్నర్ శ్రీధర్, ఎస్.వి సుధాకర్, కె.మంజునాథ్ రెడ్డి, రవీంద్రనాథ్, అశ్విని మస్తి పాల్గొన్నారు.


