హొసపేటె: డెంగ్యూ, మలేరియా, కలరా తదితర ప్రాణాంతక వ్యాధుల నుంచి జిల్లాను వంద శాతం విముక్తి చేసేందుకు అధికారులు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కవితా ఎస్ మన్నికేరి ఆదేశించారు. నగర జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి కార్యాలయంలో నిర్వహించిన అంతర్ శాఖ సమస్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక యంత్రాంగం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని తెలిపారు. పైప్‌లైన్ మరమ్మతులు లేదా ఇతర కారణాల వల్ల కలుషిత నీటి సరఫరా కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటే, సంబంధిత అధికారులను నేరుగా బాధ్యులుగా చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలల్లో రోజూ ఉదయం ప్రార్థనల తర్వాత ఈ వ్యాధుల దుష్ప్రభావాలను వివరించాలని పేర్కొన్నారు. అంటువ్యాధుల నియంత్రణలో శాఖల ప్రాతతో పాటు ప్రజల సహకారం కూడా అవసరం అని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. నీటిని మరిగించి, వడకట్టి తాగాలని సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్య కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శంకర్ నాయక్, వైద్యులు జంబయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.


