సాక్షి, బళ్లారి: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల తగ్గింపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ జాబితాలోకి కొన్ని కులాలను చేర్చడంతో జనాభా పెరిగినా దానికి అనుగుణంగా లభించాల్సిన రిజర్వేషన్లు పెంచలేదని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి, సఫాయి కర్మచారి మాజీ అధ్యక్షుడు హనుమంతప్ప ధ్వజమెత్తారు. ఆదివారం వారు నగరంలోని మోకా రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, అలాగే ఎస్టీ రిజర్వేషన్లను 3 నుంచి 7 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. 2022 నుంచి 2025 వరకు వేలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పెంచిన రిజర్వేషన్లతో ఇంజనీరింగ్, మెడికల్ ప్రైవేశాలల్లో లబ్ధి పొందారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు ఎస్సీ, ఎస్టీ నిధులను కూడా గ్యారెంటీ పథకాలకు మళ్లించి అన్యాయం చేస్తోందన్నారు. ఇప్పటికైనా స్పందించి ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, బీజేపీ నాయకులు దరప్ప నాయక్, అడవి స్వామి తదితరులు పాల్గొన్నారు.


