సాక్షి, బళ్లారి: కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఎస్‌యూసీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎస్‌యూసీఐ ఆధ్వర్యంలో కురుగోడు పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ఉన్నఫళంగా పెట్రోలు,డీజల్ ధరలను పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు. రష్యా నుంచి రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశాన్ని అమెరికా ఒత్తిడికి లోబడి వదులుకున్న విషయం అందరికి తెలిసిందే అని విమర్శించారు. అదే విధంగా పెట్రోలు, డీజిల్ ధరల్లో సగానికి పైగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే ఉన్నాయని తెలిపారు. చమురు కంపెనీల లాభాల కోసం దేశంలోనే శుద్ధి చేసి తయారు చేసే పెట్రోలు, డీజిల్‌కు అంతర్జాతీయ ధరలను నిర్ణయించే విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌యూసీఐ కమ్యూనిష్టు పార్టీ నాయకులు గురళ్లి రాజ్,కమిటి సభ్యులు మణికంఠ,అంబరీష్,తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.


