సాక్షి,బళ్లారి: తాము పదేళ్ల క్రితం లక్ష్మీ మిత్తల్ కంపెనీకి ఇచ్చిన భూములను మరో కంపెనీ జిందాల్‌కు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నిస్తూ రైతులు కదం తొక్కారు. శనివారం కుడితిని భూ పోరాట సమితి ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు ఆందోళన చేశారు. అప్పట్లో ఽతక్కువ ధరకే భూములు ఇచ్చామని, తాము భూములు ఇవ్వడంతో తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి భూములు లాక్కొన్నారని, అయితే ఎలాంటి కంపెనీని స్థాపించకపోవడంతో తాము ఎక్కువ పరిహారం ఇవ్వాలని పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేఏఐడీబీ ద్వారా లోలోపల జిందాల్ కంపెనీకి ఒక ఎకరాను రూ.28 లక్షలకు పైగా కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిత్తల్‌కు ఇచ్చిన భూమినెలా కేటాయిస్తారు?
తాము మిత్తల్ కంపెనీకి భూములు ఇస్తే జిందాల్ కంపెనీకి ఎలా బదిలీ చేస్తారు? అని ప్రశ్నించారు. ఒక కంపెనీ పేరు చెప్పి మరో కంపెనీకి భూములు ఇవ్వడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోను జిందాల్ కంపెనీకి తాము భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తామన్నారు. రైతులకు అన్యాయం చేసి, తక్కువ ధరకే లాక్కొన్న భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని, లేకపోతే ఎక్కువ పరిహారం ఇవ్వాలని, ముందుగా రైతుల వద్ద ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు, చర్చలు చేపట్టిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో ఎద్దులబండ్లలో నిరసన వ్యక్తం చేస్తూ కుడితిని నుంచి రైతులు ఇచ్చిన భూముల వరకు ఎద్దులబండ్లతో నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు.
సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. రైతులు భూముల్లోకి ప్రవేశిస్తారని తెలియగానే వందలాది మంది పోలీసులు చేరుకుని రైతులను అడ్డుకున్నారు. కుడితిని బైపాస్‌లో పెద్ద సంఖ్యలో జనం చేరి బంద్ చేశారు. ఎద్దులబండ్లను ఎక్కడికక్కడే కట్టడి చేశారు. రైతులు, పోలీసులతో ఆ ప్రాంతం అంతా కిటకిటలాడింది. రైతులను, భూ పోరాట సమితి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విడుదల చేశారు. రైతులు వందలాది మంది చేరడంతో పాటు భూపోరాట సమితి నాయకులు బసవరాజు, సత్యబాబు, జంగ్లీసాబ్, తిప్పేస్వామి, గోవర్దన్‌రెడ్డి, శేఖర్ తదితరులు నాయకత్వం వహించి అలుపెరగని పోరాటం చేశారు.
ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
మోహరించిన రైతులు, పోరాట సమితి నాయకులు
భూముల్లోకి ప్రవేశించేందుకు యత్నం
ఎద్దులబండ్లతో అన్నదాతల నిరసన
800 ఎకరాల స్వాధీనానికి ప్రయత్నం
ఆందోళనకారుల అరెస్ట్,
తర్వాత విడుదల
వందలాదిగా మోహరించిన
రైతులు, పోలీసులు


