● ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో మరో వారం రోజులు వేడి గాలులు వీస్తాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లాధికారి పూవిత పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మరో వారం రోజుల పాటు అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారన్నారు. అందువల్ల ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదన్నారు. వంట గదుల్లో కిటికీలను తెరిచి ఉంచాలన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణిగా శరణమ్మ
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో మార్పు తెస్తానని రాయచూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి శరణమ్మ పేర్కొన్నారు. శనివారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. గతంలో అధికారిగా ఉన్న నవీన్ కుమార్‌ను మైసూరుకు బదిలీ చేయడంతో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో సీనియర్ అధికారిణిగా ఉన్న తనకు జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించారన్నారు.
లోకాయుక్త వలలో గుమాస్తా
● ఖాతా మార్పునకు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
హుబ్లీ: ఖాతా మార్పునకు ఓ వ్యక్తి నుంచి రూ.2 వేల లంచం తీసుకుంటున్న గుమాస్తా లోకాయుక్త వలలో చిక్కాడు. జిల్లాలోని కుందగోళ తహసీల్దార్ కార్యాలయంలో క్లర్క్‌గా పని చేస్తున్న సురేష్ అరకేరి హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా దుండసి గ్రామ నివాసి హజరత్ అలీ ఇమామ్ సాబ్ అరళికట్టి వద్ద నుంచి ఖాతా మార్పు చేసి ఇవ్వడానికి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త ఎస్పీ ఎస్‌టీ సిద్దలింగప్ప నేతృత్వంలో డీఎస్పీ వెంకనగౌడ పాటిల్, సీఐ ప్రభులింగయ్య హిరేమఠ, ప్రసాద్ పనేకర్‌లతో కూడిన బృందం ఆ క్లర్క్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడి తర్వాత రెవెన్యూ శాఖ కొన్ని కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్న అధికారుల బృందం అర్ధరాత్రి వరకు వాటి పరిశీలన చేసి విచారణ కొనసాగించారు. లంచం ఆరోపణలు ఎదుర్కొన్న క్లర్క్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఆగస్టు 2న స్టీల్ సిటీ రన్
బళ్లారిటౌన్: బళ్లారి సైక్లిస్ట్ రన్నర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 2న బళ్లారి నగర శివార్లలో స్టీల్ సిటీ రన్– 2026 పరుగును చేపట్టినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ తిప్పారెడ్డి తెలిపారు. శనివారం ఓ ప్రైవేట్ హోటల్‌లో విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ నేత బీకే.సుందర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ పరుగును 16 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ, 3 కి.మీ.లుగా విభజించామన్నారు. 12 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి వారి వయస్సుకు తగ్గట్టుగా పరుగును ఏర్పరిచామన్నారు. సంగనకల్లు రోడ్డులోని విజ్డం ల్యాండ్ స్కూల్ వద్ద నుంచి చాగనూరు టోల్‌గేట్ వరకు పరుగు ఉంటుందన్నారు.
నడి రోడ్డులో రొమాన్స్ వీడియో వైరల్
హుబ్లీ: ఓ జంట పట్టపగలు నడి రోడ్డులో అసభ్యంగా ప్రవర్తించిన సదరు వీడియో వైరల్ అయింది. ఈ ఘటన కేశ్వాపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని గదగ్ రోడ్డు రైల్వే లోబ్రిడ్జి వద్ద నడి వీధిలో జరిగింది. ఆ జంట బహిరంగంగా ముద్దుల వర్షం కురిపించుకోవడం ప్రజాగ్రహానికి గురైంది. స్థానికులను గమనించగానే అక్కడ నుంచి ఆటోలో ఆ జంట వెళ్లి పోయారు. ఇలాంటి దృశ్యాలకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
యువకుడు ఆత్మహత్య
మరో ఘటనలో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఉణకల్ వద్ద బళిగార వీధిలో చంద్రశేఖర్‌గౌడ(26) అనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదో విషయమై మనోవేదనకు గురై జీవితంపై విరక్తితో పశువుల రేకుల షెడ్‌కు వైరుతో ఉరి వేసుకొన్నాడు. ఈ ఘటనపై విద్యానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
యువత వారధిలా పని చేయాలి
రాయచూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికి యువత నడుం బిగించాలని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ దాదావలి పేర్కొన్నారు. గురువారం మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులకు, ప్రజలకు మధ్య వారధిలా యువత పని చేయాలన్నారు. పోలీస్ స్టేషన్‌లో అందరికీ సమ న్యాయం చేస్తామన్నారు. మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు మోహిద్, సభ్యులు మారుతి, విజయ్, రశీధ్, నరేష్‌లున్నారు.
తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు
రాయచూరు రూరల్: జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజల సమస్యలను ఆలకించడం అధికారుల విధి అని అన్నారు. సమస్యల పరిష్కారానికి నగరసభ, పట్టణ పంచాయతీ, పురపాలక సంస్థల్లో అధికారులందరి సహకారం అవసరమన్నారు. వీధి దీపాల అమరిక, మురుగు కాలువల స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.


