పెట్రో మంటపై వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

పెట్రో మంటపై వినూత్న నిరసన

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

హుబ్లీ: ెపట్రోల్‌, సీఎన్‌జీ, ఎల్‌పీజీ ధరల పెరుగుదలను నిరసిస్తూ హుబ్లీ ధార్వాడ నగర, గ్రామీణ కాంగ్రెస్‌ కమిటీల ఆధ్వర్యంలో శనివారం నగరంలో వినూత్నంగా ఎద్దులబండి ప్రదర్శన చేపట్టారు. స్థానిక లామింగ్టన్‌ రోడ్డులో కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు జాతా నిర్వహించిన కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ తీరుపై నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల జీవితాన్ని దుర్భరం చేసిందని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేత అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ యుద్ధం పేరుతో ఇంధనం ధరలు పెంచి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికల వరకు మౌనంగా ఉన్న బీజేపీ ఎన్నికల తర్వాత ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందని, తక్షణమే ఈ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు.

డెంగీపై ప్రచారానికి శ్రీకారం

రాయచూరు రూరల్‌: డెంగీ వ్యాధి నియంత్రణపై ముమ్మర ప్రచారం చేపట్టాలని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్‌ సురేంద్ర బాబు సూచించారు. శనివారం జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆరోగ్య శాఖ, నగరసభల ఆధ్వర్యంలో డెంగీ దినోత్సవం పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అందరిని ఏకతాటి పైకి తెచ్చి సమాజంలో నలుగురితో సమానంగా జీవించాలన్నారు. ఇంటి వద్ద దోమలు పెరగకుండా, ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా ముందు జాగ్రత్తలు వహించాలన్నారు. సమావేశంలో నోడల్‌ అధికారులు గణేష్‌ చంద్ర శేఖరయ్య, యశోద, ఆర్‌సీహెచ్‌ అధికారిణి నందిత, మనోహర్‌ పత్తార్‌, శాకీర్‌లున్నారు.

జోరుగా వడగళ్ల వాన

హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా రామఘట్ట, ఉచ్చంగిదుర్గ, నేరబొమ్మనహళ్లి చుట్టు పక్కల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉండగా సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా వర్షం మొదలై రెండు గంటల పాటు కురిసింది. పిల్లలు, యువకులు ఇళ్ల ముందు పడుతున్న వడగళ్లను చేతుల్లోకి ఏరుకుంటూ సంబరపడ్డారు. ఈ ప్రాంతంలో కురిసిన తొలకరి వర్షం భూమిని చల్లబరచడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ఇక్కడి ప్రజలు వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు.

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

బళ్లారి అర్బన్‌: తాలూకాలోని మోకా సమీపంలోని డీ.నాగేనహళ్లిలో శనివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గురై ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని గ్రామానికి చెందిన కోరి గాదిలింగప్ప(32)గా గుర్తించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గ్రామంలో అకస్మాత్తుగా వర్షం మొదలైంది. ఆ సమయంలో గాదిలింగప్ప తన పొలంలో సపోటా పండ్లను కోస్తున్నాడు. వర్షం మధ్యలో పిడుగుపాటుకు గురై అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. కురుబ గాదిలింగప్ప మృతి అతని కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుడు గాదిలింగప్పకు తండ్రి మల్లేష్‌, భార్య మంజమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటన గురించి తెలియగానే గ్రామస్తులు పొలం వద్దకు చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా ఈ ఘటనపై మోకా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

నలుగురు

బంగ్లాదేశీయుల అరెస్ట్‌

హుబ్లీ: అక్రమంగా దేశంలోకి చొరబడిన నలుగురు బంగ్లా పౌరులను హుబ్లీ రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. హుబ్లీ రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది చేపట్టిన కార్యాచరణలో పట్టుబడిన నలుగురు బంగ్లా ప్రజల వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. అయినా కూడా వారు రైల్లో ప్రయాణించి హుబ్లీ వరకు వచ్చారు. ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకున్న ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది హుబ్లీ– గదగ్‌ రోడ్డులోని ఆర్‌పీఎఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో వీరిని తీవ్రంగా విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement