డిమాండ్లు తీర్చకుంటే ఆందోళన తప్పదు | - | Sakshi
Sakshi News home page

డిమాండ్లు తీర్చకుంటే ఆందోళన తప్పదు

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

సాక్షి,బళ్లారి: తమ న్యాయసమ్మతమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఈనెల 19వ తేదీ రాత్రి నుంచి ఆర్టీసీ బస్సుల బంద్‌ నిర్వహిస్తామని కేకేఆర్‌టీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు హెచ్‌ఏ ఆదిమూర్తి హెచ్చరించారు. ఆయన సంఘం నాయకులతో కలిసి శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుంటే కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు బాకీ ఉన్న 38 నెలల వేతనాన్ని చెల్లించాలన్నారు. దీంతో పాటు కనీసం 25 శాతం జీతాన్ని పెంచాలన్నారు. అయితే ప్రభుత్వం కేవలం 12.5 శాతం మేరకే జీతం పెంచేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం తీరును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేకేఆర్‌టీసీ సంస్థ ఉద్యోగులు నిరంతరం ప్రజా సేవలో ఉంటారని, రాత్రింబగళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తుంటారన్నారు.

తక్కువ జీతాలతో ఎక్కువ పని

తక్కువ జీతాలతో ఎక్కువ పని చేయించుకుంటున్నారని సంస్థ తీరుపై మండిపడ్డారు. ఆర్‌టీసీ సేవలు బంద్‌ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తమపై ఎస్మా ప్రయోగిస్తే ప్రభుత్వానికే నష్టం అన్నారు. అలాంటి బెదిరింపులకు తాము బెదిరేది లేదన్నారు. తమ పోరాటం కేవలం జీతాల కోసం కాదని, ఉద్యోగ భద్రత, కుటుంబాలకు రక్షణ కోసమని అన్నారు. కష్టపడి పని చేసే వారికి జీతాలు, గుర్తింపు ఎందుకు లభించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కాలయాపన ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. బస్సులు బంద్‌ చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని, అయితే అందుకు కారణం మాత్రం ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలని అన్నారు.

ఈనెల 19వ తేదీ రాత్రి నుంచి

ఆర్టీసీ బస్సుల బంద్‌కు పిలుపు

ఆర్టీసీ ఉద్యోగుల సంఘం

జిల్లా అధ్యక్షుడు ఆదిమూర్తి

Advertisement
 
Advertisement
Advertisement