బళ్లారిఅర్బన్: బళ్లారి ప్రాంత రైల్వే సమస్యలను పరిష్కరించాలని కర్ణాటక రాష్ట్ర రైల్వే యాక్షన్ కమిటీ ప్రతినిధులు శనివారం బళ్లారి ఎంపీ.ఈ తుకారాం సమక్షంలో సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ పి.అనంత్‌కు విజ్ఞప్తి చేశారు. వారు బళ్లారి రైల్వే స్టేషన్‌లో ఆయనకు వినతిపత్రం సమర్పించారు. బళ్లారి నుంచి సిరుగుప్ప మీదుగా సింధనూరు నుంచి లింగసూగూరు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బళ్లారి మీదుగా బెంగళూరుకు ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ లేదా వందే భారత్ రైలును ప్రారంభించాలని కోరారు. శివమొగ్గ–బళ్లారి– చైన్నె రైలును తిరిగి ప్రారంభించాలని, హంపీ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ కోచ్‌లను మళ్లీ 12కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. హంపీ ఎక్స్‌ప్రెస్ వేళల మార్పు, ఏసీ కోచ్‌ల అమరికలో ఉన్న గందరగోళాన్ని సరి చేయాలని కోరారు. అమృత్ భారత్ పథకం కింద బళ్లారి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, గేట్ నెంబర్ 111 వద్ద అనుసంధాన రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాగా వినతులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది.
నైరుతి రైల్వే జనరల్ మేనేజర్‌కు వినతి
బళ్లారి– లింగసూగూరు లైన్‌కు ఒత్తిడి


