బెళగావిలో రూ.4,500 కోట్ల డిపాజిట్ల స్కాం | - | Sakshi
Sakshi News home page

బెళగావిలో రూ.4,500 కోట్ల డిపాజిట్ల స్కాం

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

బనశంకరి: డిపాజిట్లకు అధిక వడ్డీలంటూ బెళగావి, చుట్టుపక్కల జిల్లాల్లో మాజీ సైనికులు, అమాయక ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల వసూలుకు పాల్పడిన కేసులో బెళగావిలో శివం అసోసియేట్స్‌ సంస్థ యజమాని శివానంద నీలణ్ణవర్‌ను శనివారం స్థానిక మాళమారుతి ఠాణా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో కొన్నిరోజులుగా శివం అసోసియేట్స్‌ రెండు ఆఫీసులు, శివానంద, ఇతర ముఖ్యుల కార్యాలయాలు, ఇళ్లు, ఫ్లాట్లలో పోలీసులు గాలింపు జరిపారు. పెద్దసంఖ్యలో బ్యాంకు అకౌంట్లు, బాండ్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్‌, కంప్యూటర్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏమిటీ బాగోతం?

శివానంద వివిధ పథకాల ద్వారా అధిక వడ్డీ ఇస్తానని వేల మంది ప్రజల నుంచి డబ్బు వసూలు చేశారు. ఈ ప్రాంతంలో సైనికులు, మాజీ సైనికుల నుంచి కూడా డబ్బులు సేకరించాడు. సుమారు రూ.4500 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు విచారణలో వెలుగు చూసింది. కొన్ని నెలలుగా ఎవరికీ వడ్డీ, అసలు ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయసాగారు. అతని ఇళ్లు, కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్‌ మహమ్మద్‌ రోషన్‌ సీజ్‌ చేశారు. ఇటీవల సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టి శివానంద వైరల్‌ అయ్యాడు. అతడు డిపాజిట్ల వసూలుకు ఆర్‌బీఐ నిబంధనలను ఏవీ పాటించలేదు. డిపాజిట్‌దారుల గురించి రికార్డులు కూడా లేవు. వేలాది మంది రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారని తేలింది.

ఆటోలో ఐస్‌క్రీంలు అమ్మిన శివానంద

శివానంద కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. హుబ్లీ ఉణకల్‌ కు చెందిన శివానంద తండ్రి ఆర్మీలో పనిచేశారు. పదవీ విరమణ తరువాత కేఈబీలో పనిచేస్తూ మృతిచెందారు. ఈ ఉద్యోగం శివానంద సోదరునికి లభించింది. బెళగావికి బదిలీ కావడంతో కుటుంబం బెళగావికి చేరుకుంది. ఇంటర్‌ చదివిన శివానంద నీలణ్ణవర్‌ ఓ కాలేజీలో సెక్యూరిటీగా పనిచేశాడు. తరువాత ఆటోరిక్షాలో ఐస్‌క్రీంలు విక్రయిస్తూ ఐస్‌క్రీం ఫ్యాక్టరీ పెట్టాడు. 2012లో షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయి, మోసాల బాట పట్టాడు. ఆక్యుమెన్‌ అనే పేరుతో ఆఫీసు తెరిచి ప్రజల నుంచి డబ్బులు డిపాజిట్లు స్వీకరించడం ప్రారంభించారు. ఇదంతా కూడా అక్రమమే. వేలాది మంది ఇతన్ని నమ్మి పెద్దమొత్తంలో డిపాజిట్లు చేయగా, అతని పంథా మారింది. జిల్లాలో ప్రముఖునిగా చలామణి అవుతూ రియల్‌ ఎస్టేట్‌ సహా అనేక వ్యాపారాలు నడిపేవాడు. జనాకర్షక కార్యక్రమాలు, సామూహిక విందులు, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల్లో నమ్మకం చూరగొన్నాడు.

ఆస్తులను జప్తు చేస్తాం: కలెక్టరు

ఆర్‌బీఐ అనుమతి లేకుండా

ప్రజల నుంచి ఎడాపెడా వసూళ్లు

శివం అసోసియేట్స్‌ యజమాని

శివానంద్‌ నీలణ్ణవర్‌ అరెస్ట్‌

బనశంకరి: శివం అసోసియేట్స్‌ యజమాని శివానంద నీలణ్ణవర్‌ మోసాలు ఒక్క జిల్లా కాదు, అనేక జిల్లాలకు వ్యాపించాయి. తనిఖీలలో పెద్ద సంఖ్యలో బాండ్లు, చెక్‌లు లభించాయని వీటి విలువ రూ.50 కోట్లపైనే ఉంటుంది, ఇది తీవ్రమైన అంశం.. అని బెళగావి కలెక్టర్‌ మహమ్మద్‌ రోషన్‌ తెలిపారు. ఈ స్కాంపై శనివారం బెళగావి కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సెబీ, ఆర్‌బీఐ, సహకార శాఖల నుంచి అనుమతులు, మార్గదర్శకాలు పాటించకుండా అధిక వడ్డీ ఆశచూపి అనధికారికంగా డిపాజిట్లు సేకరించాడని తెలిపారు. ప్రభుత్వానికి శుక్రవారం రాత్రి నివేదికను అందించామని, నోడల్‌ అధికారి ద్వారా ఆ సంస్థ స్థిర, చరాస్తులను జప్తు చేస్తారని, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ సహా పలు చర్యలను చేపడతారని వివరించారు. ఈ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.

సెబీ ద్వారా సమాచారం: కమిషనర్‌

నగర పోలీస్‌ కమిషనర్‌ భూషణ్‌ బోర్సే మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తి సెబీకి లేఖ రాయడంతో, వారు సీఐడీకి లేఖ రాశారు,, వారి సూచన ప్రకారం శివం సంస్థలో సోదాలు చేపట్టామని తెలిపారు. ఆర్‌బీఐలో ఈ సంస్థ నమోదు కాలేదన్నారు. లక్ష డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.3 వేలు అందించేవాడు. దీంతో చాలామంది డబ్బులు కట్టారని తెలిపారు. సుమారు రూ.400 కోట్ల బ్యాలెన్స్‌ షీట్‌ లభించిందని చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌, రియల్‌ ఎస్టేట్‌, చేపల వ్యాపారం తదితరాల్లో పెట్టుబడులు ఉన్నాయన్నారు. శివానంద విచారణకు సహకరించలేదని, దీంతో కస్టడీకి తీసుకున్నామని తెలిపారు. మరోవైపు కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement