పుష్ప వాహనంలో దుర్గాదేవి | - | Sakshi
Sakshi News home page

పుష్ప వాహనంలో దుర్గాదేవి

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

మాలూరు: అమావాస్య సందర్భంగా తాలూకాలోని లక్కూరు గ్రామ చెరువు కట్టపై దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. మల్లెలతో హంస వాహనం రూపంలో అలంకరించి వివిధ పూజలు జరిపించారు. మహిళా భక్తులు దీపాలు దీపారాధన చేశారు. భజన మండలి భజన, సంకీర్తనలు ఆకట్టుకున్నాయి.

రాష్ట్ర సర్కారు పెట్రో పన్నుల్ని

తగ్గించాలి: బీజేపీ

శివాజీనగర: ఇంధన ధర పెంచిన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీరు పెట్రోలుపై రూ.3, డీజిల్‌పై రూ.5.5 మేర పెంచిన పన్నులను తగ్గించాలని, ఆ తరువాత మాట్లాడాలని బీజేపీ పక్ష నేత అశోక్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత 3 సంవత్సరాల్లో పాలు నుంచి నీటి వరకు, పెట్రోల్‌ నుంచి మెట్రో రైలు ధర వరకు అన్ని చార్జీలను రాష్ట్ర సర్కారు పెంచేసిందని ఎక్స్‌లో ఆరోపించారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మీద విమర్శలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదని అన్నారు. అనేక దేశాల్లో 50 శాతం వరకూ పెట్రో ధరలు పెరిగితే, మనదేశంలో పెరిగింది 3.2 శాతం మాత్రమే అన్నారు. ఇది మోదీ సామర్థ్యంతోనే సాధ్యమైందని అన్నారు.

నీట్‌ వద్దు.. సీఈటీనే ఉత్తమం

వైద్య విద్యామంత్రి శరణు ప్రకాష్‌

ఎంబీబీఎస్‌, పీజీ సీట్లు పెంచుతాం

శివాజీనగర: మెడికల్‌ విద్యకు జాతీయ స్థాయిలో నీట్‌ పరీక్షను రద్దుచేసి, రాష్ట్రాలు సొంతంగా ప్రవేశ పరీక్షను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి శరణ ప్రకాశ్‌ పాటిల్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలో పలు దశాబ్దాల నుంచి సీఈటీ పరీక్ష విజయవంతంగా జరిగేదన్నారు. పేద, గ్రామీణ, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు సమాన అవకాశాలు లభించాయన్నారు. అయితే కొన్నేళ్ల జరుపుతున్న నీట్‌ పరీక్షల వల్ల తీవ్ర అక్రమాలు సాగుతూ విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో వైద్య సీట్ల పెంపు ఇలా

11 ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 550 ఎంబీబీఎస్‌ సీట్లను, 23 విద్యా సంస్థల్లో 572 మెడికల్‌ పీజీ కోర్సుల సీట్లను పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ వైద్య విద్యా కాలేజీల్లో ఇంతకు ముందు 1,700 సీట్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు పెంచడంతో 2,250 కు పెరిగాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 72 వైద్య విద్యాలయాల్లో 13,945 ఎంబీబీఎస్‌, 7,727 పీజీ సీట్లు ఉన్నాయని తెలిపారు.

పాము కాటుకు

గోవా కాంగ్రెస్‌ నేత బలి

యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లాలో పాముకాటుకు గోవా కాంగ్రెస్‌ నాయకుడు మరణించారు. వివరాలు.. గోవాలో పోండా శాసనసభా ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కేతన్‌ బాటికర్‌ (48) పాము కాటుకు గురయ్యారు. గోవాలోని పోండా నుంచి ఉత్తరకన్నడ జిల్లా జోయిడా తాలూకా రామనగర వద్ద అనమోడ్‌కు స్నేహితునితో కలిసి వెళ్లారు. అనమోడ్‌ ఘట్ట అడవిలో కారు నిలిపి మూత్రవిసర్జన చేస్తుండగా నాగుపాము కరిచింది. వెంటనే మిత్రుడు కారులో గోవా జీఎంసీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కేతన్‌ మృతి చెందారు.

శివలింగేశ్వర స్వామి రథోత్సవం

కోలారు: ముళబాగిలులోని శివకేశవ నగరలో పురాణ ప్రసిద్ధ శ్రీ ఉద్భవ శివలింగేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఉద్భవ శివలింగేశ్వర మూల విగ్రహానికి పంచామృత అభిషేకం, అలంకారం, పూజలు జరిగాయి. వేద మంత్ర ఘోష మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంలో ప్రతిష్టించి రథోత్సవం జరిపారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement