హైవేలో ప్రైవేటు స్లీపర్‌ బస్సు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

హైవేలో ప్రైవేటు స్లీపర్‌ బస్సు దగ్ధం

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

శివాజీనగర: అందరూ నిద్రమత్తులో ఉన్నారు, ఇంతలో ఏదో శబ్ధం, మంటలు.. ఇలా ప్రైవేట్‌ బస్సు టైర్‌ పేలడంతో నిప్పంటుకొని బస్సు కాలి బూడిదైంది. అదృష్టవశాత్తు డ్రైవరు, 36 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్న ఘటన హాసన్‌ జిల్లా శాంతిగ్రామ వద్ద హైవే–75లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది.

ఎలా జరిగిందీ?

వివరాలు.. ఓ ప్రైవేటు స్లీపరు బస్సు మంగళూరు నుంచి బెంగళూరుకు వస్తోంది. ఘటనాస్థలికి రాగానే బస్సు వెనుక టైర్‌ పేలిపోయి ఆ తాకిడికి మంటలు లేచాయి, క్షణాల్లోనే బస్సుకు విస్తరించాయి. ఇది గమనించిన డ్రైవరు బస్సును రోడ్డు పక్కన నిలిపేసి కిందికి దిగిపోవాలని ప్రయాణికులను హెచ్చరించాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు లగేజీని కూడా తీసుకోకుండా దిగిపోగా, కొన్ని నిమిషాల్లోనే మంటలు బస్సంతటికీ వ్యాపించి కాలిపోయింది.

విలువైన సామగ్రి దగ్ధం

ప్రయాణికుల లగేజ్‌, అందులోని నగదు, మొబైల్‌ ఫోన్లు విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. కొందరు ప్రయాణికులు చేతికి చిక్కిన బ్యాగ్‌లను తీసుకోగా, మిగతాకి బూడిద కావడంతో ఆవేదనకు గురయ్యారు. అతివేగం, వేడిమి వల్ల టైర్‌ పేలి ఉండవచ్చని అనుమానాలున్నాయి. హాసన్‌ నుంచి ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. బస్సు లోహపు పంజరంలా మారింది. రెండు గంటల పాటు హైవేలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరో బస్సులో ప్రయాణికులు బెంగళూరుకు వెళ్లారు. శాంతిగ్రామ పోలీసులు కేసు నమోదు చేశారు.

టైరు పేలి అంటుకున్న మంటలు

డ్రైవరు జాగ్రత్తతో తప్పిన ప్రాణహాని

హాసన్‌ జిల్లాలో ఘటన

Advertisement
 
Advertisement
Advertisement