బనశంకరి: బెంగళూరు మహా నగరంలో గత 16 ఏళ్లలో నిర్మించిన బృహత్ వసతి, వాణిజ్య కట్టడాల్లో 95 శాతానికి పైగా కట్టడాలకు నకిలీ సీసీ, ఓసీ అందించారని, ఇందులో రూ.40 వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని బీజేపీ నేత ఎన్‌ఆర్.రమేశ్ లోకాయుక్త, ఈడీకి ఫిర్యాదు చేశారు. ఆధారాల సమేతంగా శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. పాలికే నగర ప్లానింగ్ శాఖ అదికారిక సమాచారం ప్రకారం గత 16 ఏళ్లలో 4,381 సీసీ, 4,587 కట్టడాలకు ఓసీ మాత్రమే ఇచ్చారు. కానీ ఇదే అవధిలో 71, 169 కట్టడాలకు ప్లాన్ మంజూరుచేశారని తెలిపారు. 437 నిర్మాణ సంస్థలే సుమారు 25 వేలకు పైగా అపార్టుమెంట్లు నిర్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అపార్టుమెంట్లలో 22 లక్షలు ఫ్లాట్లు ఉండగా చాలావరకు కస్టమర్లు నకిలీ రికార్డులు ఆధారంగా కొనుగోలు చేసి మోసపోయారని ఆరోపించారు. బెంగళూరు లో 98 టెక్ పార్కులు, 3,876 ఐటీ కంపెనీలు, 103 బీటీ కంపెనీలు, 4,500 కుపైగా వాణిజ్య కాంప్లెక్స్‌లు, 217 మాల్స్, మల్టీప్లెక్స్‌లు, 1.10 లక్షల పారిశ్రామిక కట్టడాలు, 540 స్టార్ హోటల్స్, 2,850 సూపర్ స్పెషాలిట ఆసుపత్రులు, 1,350 కళ్యాణ మండపాలు పనిచేస్తున్నాయి. వీటిలో చాలావరకు కట్టడాలకు నకిలీ సీసీ, ఓసీ అందించారని, నగర ప్లానింగ్‌శాఖ అధికారులు, బిల్డర్ మాఫియా కుమ్మకై ్కయ్యారని ఆరోపించారు. చట్టబద్ధమైన ఫీజులకు బదులు పనిలో 25 శాతం డబ్బు లంచంగా తీసుకుని నకిలీ సర్టిఫికెట్లు అందించారని ఆయన ఆరోపించారు.ఈ కారణంతో బీబీఎంపీ, జీబీఏలకు రూ.40 వేలకోట్లకు పైగా ఆదాయం నష్టమైందని తెలిపారు. దీనిపై ఈడీ, సీబీఐ, సీఐడీ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.


