● రాష్ట్ర సర్కారుకు గవర్నర్ ఆఫీసు లేఖ
శివాజీనగర: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రేటర్ బెంగళూరు పరిధిలోని 5 కార్పొరేషన్లకు కాల పరిమితిలోగా ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయం లోక్‌భవన్ సూచించడంతో ఎన్నికల వ్యవహారం బిగుసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జూన్ 30లోగా ఎన్నికలు జరగాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశంచాలని జేడీఎస్ నేతలు ఇటీవల గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. సకాలంలో ఎన్నికలు జరిపి సుప్రీంకోర్టు సూచనలను పాటించాలి, లేదంటే కోర్టు ధిక్కారం అవుతుందని నేతలు తెలిపారు. ప్రజాప్రతినిధుల ప్రజా హక్కులను కాపాడేందుకు, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు జరపాలన్నారు. లేనిపక్షంలో ప్రజలకు తప్పుడు సందేశం వెళుతుందన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావని తెలిపారు.
లేఖలో ఏముంది?
పరిశీలించిన గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్.ప్రభుశంకర్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్‌కు లేఖ రాశారు. ఎలాంటి సమస్యలు కాకుండగా ఎన్నికలను ప్రశాంతంగా జరిపేందుకు ఈసీకి, ప్రభుత్వం నిధులు, సిబ్బందిని మంజూరు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఎన్నికలను ఆలస్యం చేయకుండా సకాలంలో జరిపేలా చూడాలన్నారు. లేఖపై సర్కారు స్పందనపై కుతూహలం నెలకొంది.
నగల షాపులో భారీ చోరీ
దొడ్డబళ్లాపురం: దొంగల ముఠా బంగారు నగలు చోరీ చేసిన సంఘటన హావేరి జిల్లా హానగల్ తాలూకా చిక్కాంశి హొసూరు గ్రామంలో జరిగింది. గ్రామంలో అణ్నప్ప భజంత్రి అనే వ్యాపారికి నగల షాపు ఉంది. అందులోకి జొరబడ్డ దుండగులు సుమారు రూ. 80 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకుని, షాపులోని 7 క్వింటాళ్ల బరువు గల ఉక్కు లాకర్ కూడా ఎత్తుకెళ్లారు. లాకర్‌లో విలువైన వస్తువులు ఉన్నట్లు యజమాని తెలిపాడు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. హానగల్ పోలీసులు విచారణ చేపట్టారు.


