అంజనాద్రి శ్రీఆంజనేయస్వామికి దాత సమర్పించిన బంగారు ఆభరణాలు
సాక్షి బళ్లారి: హంపీ సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున అంజనాద్రిపై ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానానికి సమర్పించిన బంగారు నగల వ్యవహారం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏఎంఆర్ గ్రూప్స్ అధినేత మహేశ్వరెడ్డి ఈనెల 8న రూ.కోట్ల విలువైన ప్రభావళి, గద, చక్రం, తదితర ఆభరణాలను విరాళంగా సమర్పించారు. ఇవన్నీ 1,400 గ్రాముల బంగారంతో చేసినవని, రూ.2.50 కోట్ల విలువని దాత తెలిపారు. దేవాదాయ అధికారులు ఆ నగల నాణ్యతను పరిశీలించగా 250 గ్రాములు మాత్రమే బంగారం ఉందని నిర్ధారించడం చర్చనీయాంశమైంది. అన్నింటినీ రాగితో తయారు చేసి బంగారు పూత పూశారని ఆలయ పెద్దలు చెప్పడంతో వివాదం మొదలైంది. ఇంత వ్యత్యాసం ఎలా సాధ్యమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరీక్షలకు సమయం పడుతుంది: కలెక్టర్
ఈ నేపథ్యంలో కొప్పళ జిల్లా కలెక్టరు సురేశ్ హిట్నాల్ ఈ వివాదంపై మంగళవారం సాయంత్రం తమ కార్యాలయంలో మాట్లాడారు. ‘మహేశ్వరరెడ్డి 1,400 గ్రాముల బంగారం సమర్పించినట్లు రికార్డుల్లో ఉంది. అది పూర్తిగా నిర్ధారణ జరిగే వరకు నకిలీనా, అసలా అనేది తేల్చలేం. లేజర్ టెక్నాలజీతో పరిశీలన చేయిస్తాం. ఆయన అన్ని రకాల రికార్డులు సమర్పించారు, 50 ఏళ్ల వారంటీ కూడా ఇచ్చారన్నారు. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే బంగారు ఆభరణాలు తయారు చేసిన వారే బాధ్యులని వారి దృష్టికి తీసుకెళతామన్నారు.
బెంగళూరు లేదా హరియాణా నుంచి నిపుణులైన బంగారు పనివాళ్లను పిలిపించి తనిఖీలు చేయిస్తాం. హొసపేటెకు చెందిన నాగరాజు ఆచారి అనే నిపుణుడు పరిశీలించి ఒక కేజీ బంగారం ఉండవచ్చన్నారు. హట్టి గోల్డ్‌మైన్స్ అధికారులను కూడా సంప్రదించాం. కానీ నిర్ధారణకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. బీఎస్‌ఐ హాల్‌మార్క్ సంస్థను సంప్రదించగా, బంగారాన్ని ఇప్పటికే రాగితో కలిపి ఆభరణాలు తయారు చేసినందున అందులో కచితమైన బంగారం ఎంతుందో చెప్పడం కష్టమన్నారు. పూర్తిగా తేల్చేందుకు మరింత సమయం పడుతుంది’ అని తెలిపారు.
అంజనాద్రి హనుమంతునికి..
విరాళమిచ్చిన ఆభరణాలపై వివాదం
పరిశీలన చేస్తున్నాం: కలెక్టరు


