బర్త్‌డే రోజే విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

బర్త్‌డే రోజే విద్యార్థిని ఆత్మహత్య

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

పెళ్లి చేస్తున్నారని ఆవేదన

రాయచూరు రూరల్‌: తాను చదువుకుంటానంటే, తల్లిదండ్రులు పెళ్లి ఖాయం చేశారు, తనకిక చదువుకునే యోగమే లేదా అనే ఆవేదనతో పుట్టినరోజే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బెళగావి నగరం అజాంనగరలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో జరిగింది. జిల్లాలో హుక్కేరి తాలూకా కటాబళికి చెందిన కావేరి నాయక్‌ (21) బీఎస్సీ చివరి ఏడాది చదువుతూ ఈ హాస్టల్‌లో ఉంటోంది. ఆమెకు మూడు నెలల క్రితం పోలీస్‌ కానిస్టేబుల్‌తో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు పెళ్లి పనులకు సిద్ధమవుతున్నాయి. కానీ చదువుకోవాలనే ఆకాంక్షకు పెళ్లి అడ్డుగా ఉందని కావేరి మథన పడుతూ ఉండేది. ఈ కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలున్నాయి. సోమవారం ఆమె బర్త్‌ డే కాగా అదేరోజు ప్రాణాలు తీసుకోవడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

కేపీఎస్‌సీ భ్రష్టు: కుమార

యశవంతపుర: కర్ణాటకలో ఎన్నిసార్లు పరీక్షలను వాయిదా వేయలేదు? కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు అనేక సార్లు ఇబ్బంది కలిగింది అని కేంద్రమంత్రి హెచ్‌డి కుమారస్వామి అన్నారు. నీట్‌ పరీక్షల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న అరోపణలపై మండళవారం నగరంలో స్పందించారు. రాష్ట్రంలో కేపీఎస్‌సీ సంస్థను సరి చేయలేదు, ఆ సంస్థను నాశనం చేశారని కాంగ్రెస్‌ సర్కారుపై మండిపడ్డారు. పోస్ట్‌కు డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు, ప్రజలు వీధుల్లో చర్చించుకొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు నీట్‌పై అరోపణలు చేయడం సబబు కాదన్నారు.

పేలిన ఈవీ స్కూటర్‌,

వ్యక్తి మృతి

దొడ్డబళ్లాపురం: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీ పేలిన దుర్ఘటనలో వ్యక్తి మృతిచెందిన సంఘటన బెంగళూరులోని హలసూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మర్ఫి టౌన్‌లో జరిగింది. వివరాలు.. లూర్థనాథన్‌ (62) ఇంట్లో తన స్కూటర్‌కు చార్జింగ్‌ పెట్టి అక్కడే పడుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్కూటర్‌ బ్యాటరీ పేలింది. పేలుడు ధాటికి లూర్థనాథన్‌ తీవ్రంగా గాయపడి అక్కడే మరణించాడు. ఇంట్లో మంటలు అంటుకుని వస్తువులు కాలిబూడిదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

హస్తం ఎమ్మెల్సీల

ఢిల్లీ యాత్ర

బనశంకరి: మంత్రి పదవులు కావాలంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ఢిలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీలు పుట్టణ్ణ, మధు మాదేగౌడ, బసణ్ణగౌడ బాదర్లి, చంద్రశేఖర్‌పాటిల్‌, డీటీ శ్రీనివాస్‌ తదితరులు మంగళవారం రాష్ట్ర ఇన్‌చార్జ్‌ రణదీప్‌సింగ్‌ సూర్జేవాలాను కలిశారు. త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, కనీసం ఐదుమంది ఎమ్మెల్సీలకు క్యాబినెట్‌లో చోటివ్వాలని కోరారు. ముఖ్యమంత్రి మార్పు గందరగోళాన్ని త్వరగా పరిష్కరించాలని మనవిచేశారు. వివిద కార్పోరేషన్లు, బోర్డు పదవుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.

నిర్లక్ష్య ఫలితమే

బౌరింగ్‌ విషాదం

శివాజీనగర: ఇటీవల నగరంలో వర్షాలకు బౌరింగ్‌ ఆస్పత్రి గోడ కూలి ఏడుమంది ప్రజలు బలైన కేసులో జిల్లాధికారి జగదీశ్‌ ప్రభుత్వానికి దర్యాప్తు నివేదికను అందజేశారు. ఈ దుర్ఘటనలకు ఆరోగ్య శాఖ ఇంజనీర్‌, కాంట్రాక్టర్‌ల నిర్లక్ష్యమే కారణం. ఆస్పత్రి పాలక మండలి నిర్లక్ష్యం కూడా ఉందని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ లోతుగా తనిఖీ చేపట్టి సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాం, అన్నింటినీ చెప్పలేము, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొంటుందో వేచి చూడాలన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల సవరణ

యశవంతపుర: రాష్ట్ర ప్రభుత్వం రావాణాశాఖ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగులు, అధికారుల వేతనాలను పరిష్కరిస్తూ అదేశాలను జారీ చేసింది. పూర్వ కింకో ఉద్యోగులు/కేఎస్‌ఆర్టీసీ/బీఎంటీసీ/వాయువ్య కర్ణాటక/కల్యాణ కర్ణాటక రవాణా శాఖ ఉద్యోగులకు వేతన పరిష్కరణ చేసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 31, 2025న అందుకున్న మూల వేతనంపైకి 12.50 శాతం పెంచింది. ఈ పెంపు 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ జూలై 1 నుంచి పెంచిన వేతనం అందిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement