● మరో ఇద్దరికి గాయాలు
●యాదగిరి జిల్లాలో విషాదం
సాక్షి బళ్లారి: భారీ వర్షాల కారణంగా పాతమిద్దె గోడ కూలి బాలిక మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాదగిరి జిల్లా వడగేరి తాలూకా తుమకూరు గ్రామంలో జరిగింది. భారీ వర్షం కురవడంతో పాతమిద్దె గోడ కూలడంతో అక్షిత(8) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆడుకుంటున్న సమయంలో ఉన్నఫళంగా గోడ కూలడంతో అక్షిత మృత చెందగా, సంగీత, భూమిక అనే ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. వర్షాలు భారీగా కురవడంతో ఇంటి పైకప్పుపై నీరు నిలబడంతో గోడ కూలినట్లు స్థానికులు పేర్కొన్నారు.
అధికారుల పరామర్శ
ఈ విషయం తెలుసుకొన్న వెంటనే జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ తదితరులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాల కింద చిక్కుకొన్న చిన్నారులను ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు పూర్తిగా బలహీన పడటంతో పాతమిద్దె కావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. వారు బాలిక కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
రాయచూరు రూరల్: అప్పుల బాధ భరించలేక బంగారు అభరణాలు విక్రయించే దుకాణపు యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి వేళ సింధనూరులో ప్రాణేష్ వర్ణికర్(45) తమ అద్దె ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. రూ.2.5 కోట్ల మేర అప్పులుండడం, మరో వైపు కుటుంబ కలహాలతో భార్య దూరంగా ఉండడం అతడిని కలిచి వేయడంతో ఆ బాధలను దిగమింగ లేక ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. చాలా ఏళ్ల నుంచి నగరంలో జువెలరీ దుకాణం నడుపుతూ పార్ట్ టైమ్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తుండే వాడని, ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
సమాజ సేవ ఎన్‌ఎస్‌ఎస్ లక్ష్యం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో సేవ చేయడం ఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన లక్ష్యమని మటమారి పంచాయతీ అభివృద్ధి అధికారి శేఖరప్ప అభిప్రాయపడ్డారు. సోమవారం రాయచూరు తాలూకా మటమారిలో సర్కారీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు గ్రామీణ ప్రాంత సమస్యల గురించి వివరించాలన్నారు. పాఠ్యాంశాలపై చర్చ జరగాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ సంస్థ నలుగురికి సహాయం చేయడం నిస్వార్థంతో కూడినది అని వివరించారు. గ్రామాల్లో సేవలు, స్వచ్ఛత, రక్తదానం, ఆరోగ్యం, పరిసరాల సంరక్షణపై దృిష్టి పెట్టాలన్నారు. బసనగౌడ, ప్రిన్సిపాల్ సుగుణ, సంతోష్, వీరాంజనేయ, ఈరణ్ణ, శరణేగౌడ, రేఖ, మహేశ్వరి, తేజేశ్వరిలున్నారు.
సర్వే పనుల్లో జాప్యం తగదు
రాయచూరు రూరల్: భూ మాపన శాఖలో సర్వేయర్లు గత 72 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రైతుల భూములను సర్వే చేయడంలో జాప్యం తగదని రైతు సంఘం సంచాలకుడు గురురాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల భూములను కొలత వేసుకోవడానికి పలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 6.50 లక్షలు, రాయచూరు జిల్లాలో 19,496 సర్వే రికార్డులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. త్వరితగతిన రైతుల సమస్యల పరిష్కారానికి సర్కార్ ముందుకు రావాలన్నారు.
గొలుసుల దొంగకు జైలు శిక్ష
హుబ్లీ: బంగారు గొలుసు దొంగతనం ఆరోపణలు రుజువు కావడంతో ఓ దొంగకు మొత్తం 9 కేసుల్లో రెండేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ మూడో ఏసీజేఎం కోర్టు తీర్పునిచ్చింది. విశ్వనాథ్ సోమప్ప కోళివాడ శిక్షకు గురైన వ్యక్తి. ఇక్కడి విద్యాగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా మహిళల మంగళ సూత్రాల చోరీలు చేశాడు. ఆరోపణలు రుజువైన క్రమంలో న్యాయమూర్తి అళ్లప్ప ఎం.బడిగేర ఆ 9 కేసుల్లో రెండేళ్ల చొప్పున జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ప్రభుత్వం తరపున కేసు వాదించిన సీనియర్ సహాయక న్యాయవాది అనిల్‌కుమార్ తెలిపారు.
కులదూషణ కేసు నమోదు
అదే విధంగా మరో ఘటనలో కులం పేరుతో దూషణపై కేసు నమోదైంది. గత నెల 13న రాత్రి అమరగోళ ఏపీఎంసీ బసవ కాలనీలో డాక్టర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా బ్యానర్ కట్టే విషయంలో అసభ్యంగా తిట్టడమే కాకుండా కుల దూషణకు పాల్పడి ప్రాణాలు తీస్తామని కూడా బెదిరించిన ఆరోపణలపై బాధితురాలు విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు ఓ వ్యక్తిపై నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


