అభివృద్ధి పనులకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు శ్రీకారం

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

బళ్లారిటౌన్‌: నగరంలో వివిధ వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సిటీ ఎమ్మెల్యే భరత్‌రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. 21వ వార్డులోని హరిప్రియ నగర్‌లో రూ.5 కోట్ల వ్యయంతో రోడ్డు, ఓపెన్‌ డ్రైనేజీ, విద్యుత్‌ దీపాల అమరిక పనులకు, సిద్ధార్థ కాలనీలో రూ.50 లక్షలతో లింక్‌ రోడ్ల అభివృద్ధికి, బ్రహ్మయ్య కాలనీలో రూ.50 లక్షలతో లింక్‌ రోడ్లకు, విద్యానగర్‌లో 7వ రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ జరిపారు. అనంతరం 4వ వార్డులోని పాండురంగ దేవస్థానం నుంచి హొన్నళ్లి రోడ్డు వరకు రూ.1.5 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ రాజేశ్వరి సుబ్బరాయుడు, చానాళ్‌ శేఖర్‌, శివశంకర్‌ గౌడ, పంపనగౌడ, తిమ్మనగౌడ, నాగేశ్వరరావు, విరుపాక్షగౌడ, పంపాపతి, పరశురాముడు, సిరిగేరి పన్నరాజు, ప్రభాకర్‌ రెడ్డి, హగరి వండ్రి తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో హనుమ జయంతి

సాక్షి,బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, శ్రీరాముని పరమభక్తుడు హనుమ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మంగళవారం హనుమ జయంతిని పురస్కరించుకుని నగరంలోని బాలాంజనేయ స్వామి ఆలయం, మోకా రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం, సిరుగుప్ప రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం తదితర ఆంజనేయ స్వామి ఆలయాలు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిక్కిరిశాయి. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆంజనేయ స్వామి జన్మస్థలం గంగావతి సమీపంలోని అంజనాద్రిలో వెలసిన అంజనేయ స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

వీధి కుక్కలకు విషాహారం

రెండు శునకాల మృత్యువాత

విజయపుర జిల్లాలో కలకలం

సాక్షి బళ్లారి: విజయపుర జిల్లాలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడటంతో ఆక్రోశం వ్యక్తం చేసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీధి కుక్కలకు విషాహారం ఇచ్చారు. వీధి కుక్కల బెడద నివారణపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారుల తీరుపై మండిపడ్డారు. మహానగర పాలికె నిర్లక్ష్యంగా పని చేస్తోందని, వీధి కుక్కలను నియంత్రించడాన్ని పట్టించుకోవడం లేదని, ప్రతి రోజు నగరంలో ఏదో ఒక చోట కుక్కలు ప్రజలను గాయపరుస్తున్నాయని ఆరోపించారు. దీంతో వీధి కుక్కలను తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకొన్నారు. అయితే ఇదే సందర్భంలో విజయపుర నగరంలోని పలు కాలనీల్లో విచ్చలవిడిగా ఉన్న వీధి కుక్కలకు విషాహారం ఇవ్వడంతో రెండు కుక్కలు మృతి చెందాయి. ఈ ఘటనతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జంతువులను కాపాడాల్సిందిపోయి విషాహారం పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

బ్యాంక్‌ ఉద్యోగుల ధర్నా

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్యాంక్‌ అధికారులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిందని ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. మంగళవారం ఎస్‌బీఐ వద్ద చేపట్టిన ఆందోళనలో ఉద్యోగుల సంఘం కార్యాధ్యక్షుడు సోమశేఖర్‌ మాట్లాడారు. ప్రభుత్వం అధికంగా పని భారం పెంచిందన్నారు. సిబ్బంది కొరతను నివారించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, 2019 నుంచి ఉద్యోగంలో చేరిన వారికి ఐసిటీ మార్పులు చేయాలన్నారు. వేతనాల్లో తారతమ్యాలను నివారించాలని తదితర డిమాండ్లు తీర్చాలని ఒత్తిడి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement