హుబ్లీ: దేశ ప్రజలను బంగారం కొనుగోలు చేయవద్దని, బంగారం మీద పెట్టుబడులు పెట్టవద్దని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జంట నగరాలతో పాటు ధార్వాడ జిల్లా వ్యాప్తంగా సంబంధిత వ్యాపారులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరేమో వివిధ రకాలుగా అభిప్రాయాలను వెల్లడించారు. 25 శాతం ప్రజలు కొనుగోలు చేసినా ఫర్వాలేదని హుబ్లీ నగర బంగారు వ్యాపారులు తెలిపారు. సంబంధిత హుబ్లీ సరాఫ్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పరశురామ బిలాల్ మాట్లాడుతూ భారతీయులకు బంగారం అంటే మోజు ఎక్కువని అన్నారు. అయితే దేశంలో బంగారం ఉత్పత్తి కావడం లేదన్నారు. దీంతో విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం.
వ్యాపారులకు ఎలాంటి సమస్యా కాదు
డాలర్ ముందు రూపాయి విలువ పడిపోయింది. దీంతో ప్రధాని మోదీ బంగారు కొనుగోలు చేయరాదని సూచించడం సమంజసమేనన్నారు. దీని వల్ల బంగారు వ్యాపారులకు ఎటువంటి సమస్య కాదన్నారు. తులం బంగారు ధర రూ.లక్షకు పెరిగినప్పటి నుంచి కొనుగోలుదారుల సంఖ్య తగ్గిపోయింది. దీపావళి, ఉగాది, అక్షయ తృతీయ రోజుల్లో కూడా ప్రజలు అంతగా బంగారు కొనుగోలు చేయడం లేదన్నారు. ప్రధాని చెప్పారన్న కారణంతో ప్రజలు కొనుగోలు చేయడం మానరు. 25 శాతం ప్రజలు కొనుగోలు చేసినా చాలని, వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని అన్నారు. అయితే ఈ పరిణామం సంబంధిత వృత్తిపర కార్మికులపై పడుతుందన్నారు. అయితే ఆ కార్మికులందరూ బెంగాల్‌కు చెందిన వారని, హుబ్లీలో వారే ఎక్కువగా ఉన్నారన్నారు.
ధర తక్కువ ఉన్నప్పుడే డిమాండ్ ఎక్కువ
హుబ్లీలో 450 బంగారు అంగళ్లు ఉన్నాయి. షరాఫ్ బజార్‌లో 190 మంది సభ్యులు ఉన్నారు. రూ.లక్ష కన్నా తక్కువగా ధర ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండేది. అధిక విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం చాలా తగ్గిపోయిందన్నారు. మొత్తానికి దేశాభివృద్ధి కోసం ప్రజలందరూ కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకొని అమలు చేయాల్సి ఉందని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. ఓ వినియోగదారుడు మాట్లాడుతూ మోదీ ఏ ఉద్దేశంతో ఆ ప్రకటన చేశారో తెలియదు. అయితే మా ఇళ్లల్లో పిల్లల పెళ్లిళ్లు నిశ్చయం అయ్యాయి. పెళ్లిలో బంగారం పెట్టకపోతే కుదరదు. మా డబ్బులు ఇచ్చి బంగారు కొంటాం. ఇతరులు ఎవరూ మాకు డబ్బులు ఇవ్వరు. మేము వరకట్నం విషయంలో మాట ఇచ్చినట్లుగా బంగారం కట్టపెట్టాల్సి ఉంటుందన్నారు.
బంగారం కొనుగోళ్లపై జనంలో
జోరందుకున్న చర్చలు
ప్రధానమంత్రి వ్యాఖ్యలతో ప్రజల్లో
తీవ్ర సందిగ్ధత నెలకొన్న వైనం


