వైభవం.. హులిగమ్మ దేవి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. హులిగమ్మ దేవి రథోత్సవం

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

హొసపేటె/రాయచూరు రూరల్‌: కొప్పళ జిల్లాలో చారిత్రాత్మక ప్రసిద్ధ శక్తి పీఠంగా నిలిచిన హులిగిలో వెలిసిన హులిగమ్మ దేవి రథోత్సవం మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. కొప్పళ తాలూకాలోని సుక్షేత్ర హులిగి గ్రామంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమైన ఈ రథోత్సవంలో కొప్పళతో పాటు విజయనగర, బళ్లారి, గదగ్‌, రాయచూరు వంటి సరిహద్దు జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అక్కడికి చేరుకున్న లక్షలాది మంది భక్తులు రథోత్సవాన్ని వీక్షించి ఆనంద నినాదాలు చేశారు. హులిగమ్మ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించిన రథాన్ని లాగారు. రథం తిరిగి యథాస్థానానికి చేరుతుండగా, భక్తుల నుంచి చప్పట్లు మారుమోగాయి. ఉదో ఉదో.. హులిగమ్మ అని భక్తులు పదే పదే నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ రాజశేఖర్‌ హిట్నాళ్‌, ఎమ్మెల్సీ హేమలత నాయక్‌, మాజీ ఎంపీ సంగణ్ణ కరడి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ డాక్టర్‌ రామ్‌ ఎల్‌. అరసిద్ది మార్గదర్శకత్వంలో తగిన పోలీసు భద్రత కల్పించారు. హులిగమ్మ అభివృద్ధి ప్రాధికార సంస్థ సభ్యులు, కార్యదర్శి ప్రకాష్‌ రావు, ప్రపంచ పశు వైద్య సంక్షేమ బోర్డు అధ్యక్షుడు దయానంద స్వామీజీ, హులిగి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, సభ్యులతో సహా చుట్టు పక్కల అనేక గ్రామాల నుంచి భక్తులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement