హొసపేటె: మహిళా, శిశు అభివృద్ధి శాఖ, మహిళా సాధికారత విభాగం, అక్క పడె, విజయ మహిళా సురక్షా పడె బృందాల సంయుక్త ఆధ్వర్యంలో హంపీలోని ముఖ్య ప్రదేశాల్లో సోమవారం మహిళల భద్రత, రక్షణపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపీలోని విరుపాక్ష ఆలయం, రథ వీధి, బస్టాండ్ పరిసరాల్లోని భద్రతా చర్యల గురించి ప్రజలకు, మహిళా పర్యాటకులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మిషన్ కో–ఆర్డినేటర్ విద్యా, జెండర్ స్పెషలిస్ట్ అన్నపూర్ణ మాట్లాడుతూ మిషన్ శక్తి బేటీ బచావో.. బేటీ పడావో, సఖి వన్ స్టాప్ సెంటర్ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వివిధ పథకాల సౌకర్యాలను మహిళలు ఎలా పొందవచ్చో వివరించారు. కష్టాల్లో ఉన్న మహిళలకు కేంద్రం అందిస్తున్న సహాయం గురించి సఖి కేంద్ర నిర్వాహకురాలు బషీరా బీ సమాచారం అందించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా అత్యవసర పరిస్థితిలో మహిళల హెల్ప్‌లైన్–181, పోలీస్ అత్యవసర సేవ–112, పిల్లల హెల్ప్‌లైన్–1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్–1930లకు సమాచారం అందించాలన్నారు. బృందం సభ్యులు పిల్లలపై లైంగిక నేరాల నివారణ చట్టం గురించి వివరించారు. అక్క పడె, విజయ మహిళా సురక్షా పడె సిబ్బంది అక్కడికి వచ్చిన మహిళా పర్యాటకులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. అక్కపడె సిబ్బంది, విజయ మహిళా సురక్షా పడె సభ్యులు పాల్గొన్నారు.


