హొసపేటె: పంటల సాగు అవసరాలకు అనుగుణంగా రైతులు మార్కెట్లో యూరియా, ఎరువులను పొందేలా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు కొనుగోలు చేసే ఎరువులతో పాటు అదనంగా లింక్ ఉత్పత్తులుగా ఇతర వస్తువులను కూడా కొనాలని ఒత్తిడి చేసే పంపిణీదారులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రాష్ట్ర రైతుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. రైతు సంఘం నేతలు జగన్‌రాజ్ బసవరాజ్ మాట్లాడుతూ ఎఫ్‌ఐడీ ద్వారా ఎకరాకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వాలనే నిబంధనను రద్దు చేయాలన్నారు. రైతులకు అవసరం లేని ఇతర ఎరువులను, వారికి కావాల్సిన ఎరువులతో పాటు తప్పనిసరిగా కొనాలనే నిబంధనను తొలగించాలన్నారు. రైతులపై లింక్ ఎరువుల పేరుతో అదనపు ఎరువులను కొనాలని ఒత్తిడి చేసే పంపిణీదారులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువులు కొనుగోలు చేసే రైతులపై నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు హనుమంతప్ప, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.


