● మండ్య జిల్లాలో విషాదం
మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని హెరగనహళ్లి గ్రామంలో కోడి చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు మునిగిపోయారు. సత్యప్రకాష్ (17), యశస్ (17), స్నేహితులు కాగా, ఇటీవలే టెన్త్ పాసై, ఇంటర్‌లో చేరబోతున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు చెరువులో ఈతకు వెళ్లి మునిగిపోయారు. రాత్రయినా ఇళ్లకు రాకపోవడంతో తల్లిదండ్రులు భయపడి స్నేహితులు, బంధువుల ఇళ్లలో విచారించగా రాలేదని తెలిపారు. ఈతకు చెరువుకు వెళ్లినట్లు తెలిసి అక్కడకు చేరగా, బైక్, బట్టలు, చెప్పులు కనిపించాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు, ఫైర్‌సిబ్బంది, గ్రామస్తులు గాలించగా, బాలలు విగతజీవులుగా బయటపడ్డారు. మంత్రి ఎన్. చలువరాయస్వామి ఆసుపత్రిలో బాలల మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రధాని రక్షణపై సర్కారు
నిర్లక్ష్యం: శోభ
బనశంకరి: కర్ణాటక ప్రభుత్వానికి ప్రధాని రక్షణ పట్ల ప్రేమ ఉందా? అని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ప్రశ్నించారు. సోమవారం బెంగళూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని ఆదివారం వస్తున్నారని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం 100 మందికి పైగా ఇన్‌స్పెక్టర్లు, పోలీస్ అధికారులను ఎందుకు బదిలీ చేసింది, దీని వల్ల పోలీసుల్లో గందరగోళం ఏర్పడి ఉంటుందన్నారు. ఇలాంటి అత్యవసర సమయంలో బదిలీలు ఎందుకో తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వాలని, ప్రధాని ప్రయాణించే దారిలో భద్రతను ఎందుకు పెంచలేదని అన్నారు.
షెడ్డులో మంటలు..
చిన్నారుల సజీవ దహనం
బనశంకరి: బెంగళూరులో కొత్తనూరు సమీపంలోని నారాయపురలో షెడ్‌లో నిప్పు అంటుకుని ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. వివరాలు.. రాయచూరుకు చెందిన వలస కూలీ కుటుంబం షెడ్డులో జీవిస్తోంది. వారి పిల్లలు అర్జున్ (5), ఆశా (3). సోమవారం ఉదయం తల్లిదండ్రులు పనులకు వెళ్లగా ఇంటి వద్ద అవ్వతో కలిసి బాలలు ఉన్నారు. మధ్యాహ్నం 1:30 సమయంలో అవ్వ షెడ్‌లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో మంటలు లేచాయి. పిల్లలిద్దరూ బయటకు వెళ్లకుండా షెడ్‌లోనే దాక్కున్నారు. చివరకు మంటల్లో చిక్కి మృత్యువాత పడ్డారు. కొత్తనూరు పోలీసులు పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. పిల్లలు లేరని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
శృంగేరి రీకౌంటింగ్‌పై సుప్రీం స్టే
● రాజేగౌడ కొనసాగింపు
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా శృంగేరి అసెంబ్లీ క్షేత్రం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో గెలిచిన బీజేపీ అభ్యర్థి జీవరాజ్ వ్యవహారం మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ ఓటింగ్‌లో ఓడిపోయిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజేగౌడ సుప్రీంకోర్టులో అర్జీ వేయగా, విచారించిన ధర్మాసనం అక్కడ యథాస్థితిని కాపాడాలంటూ ఆదేశించింది. ఫలితాలపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు అదేశాలను రాజేగౌడ సుప్రీంలో సవాల్ చేశారు. గత ఎన్నికల ఓట్లు, తాజాగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమాచారం, జిల్లాధికారి గౌరవ్‌శెట్టి నిర్ణయాలు తదితరాలను ధర్మాసనం ముందు సమర్పించారు. పరిశీలించిన ఇద్దరు న్యాయమూర్తులు.. రీకౌంటింగ్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పోస్టల్ ఓట్ల లెక్కింపు సమాచారాన్ని సీల్డ్ కవర్‌లో అందించాలని ఎన్నికల కమిషన్‌కు నోటీసులిచ్చారు. రీకౌంటింగ్ ఫలితాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించడంతో రాజేగౌడకు ఊరట దక్కినట్లయింది. ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగుతారు.
మోదీ బాగా చెప్పారు: దేవేగౌడ
బనశంకరి: బంగారం కొనొద్దు, ఇంధనాలను పొదుపుగా వాడుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను మనందరం స్వాగతించాలని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ తెలిపారు. సోమవారం బెంగళూరులో మాట్లాడిన ఆయన అంతర్జాతీయ సంఘర్షణతో దుష్పరిణామాలు ఏర్పడ్డాయి, ఈ సందర్భంలో నరేంద్ర మోదీ చెప్పిన మంచి సలహాలను స్వాగతించాలన్నారు.


