కోలారు: నగర సమీపంలోని టమకలో రేణుకా యల్లమ్మ దేవి పూల కరగ ఉత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. పూజారి కరగనెత్తుకుని రేణుకా యల్లమ్మ దేవాలయం ముందు మంగళ వాయిద్యాలకు నృత్యమాడారు. గ్రామంలోని అన్ని వీధుల గుండా కరగ సాగింది.
కేంద్ర మంత్రులకూ
మోదీ ఆ మాట చెప్పాలి
● డీసీఎం శివకుమార్ విసుర్లు
దొడ్డబళ్లాపురం: పెట్రోల్, డీజిల్‌ను తక్కువ వాడాలని, బంగారం కొనవద్దని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు చెప్పే ముందు కేంద్రమంత్రులకు, అధికారులకు అదే మాట చెప్పాలని డీసీఎం డీకే శివకుమార్ విమర్శించారు. సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రులు, ప్రభుత్వఽ అధికారులు కూడా కార్లలో కాకుండా బస్సుల్లో, మెట్రో రైళ్లలో తిరగాలని ఆదేశాలివ్వాలన్నారు. మోదీ బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రజలకు చెప్పడం లేదని, కేవలం పెట్రోల్,డీజిల్ తక్కువ వాడాలని చెబుతున్నారని అన్నారు. ప్రధాని సలహాలు ఇచ్చే ముందు కేంద్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో ఈ పని చేయించి నాంది పలకాలన్నారు. దేశంలో శుభ కార్యాలకు బంగారం కొనడం అనాదిగా వస్తున్న ఆచారమని, ప్రజలను కొనవద్దని చెప్పడం సమంజసమా? అని ప్రశ్నించారు.
13న బెంగళూరువాసులకు బహుమతి
బెంగళూరు వాసులకు మే 13న పెద్ద గిఫ్ట్ ఇస్తున్నట్టు డీసీఎం తెలిపారు. దానిపై సుర్జేవాలాతో రాజకీయ అంశాలపై చర్చించామని, ఇప్పుడు అధికారులను పిలిచి సూచనలు ఇచ్చానన్నారు. పెద్ద బహుమతిని గ్యారంటీగా ఇస్తానని, అదేమిటనేది ఆ రోజే చెబుతానన్నారు.
యువకున్ని బలిగొన్న
గంజాయి కేసు
మైసూరు: మైసూరులోని రామకృష్ణ నగరలో ఓ యువకుడు తనపై గంజాయి సేవనం కేసు పెట్టారని ఆత్మహత్య చేసుకున్నాడు. 4వ మెయిన్ నివాసి అయిన ఎం. మధు (22), వృత్తి రీత్యా వడ్రంగి, 6వ తేదీ రాత్రి 9 గంటలకు ఓ చెట్టు వద్ద గంజాయి సిగరెట్‌ను సేవిస్తూ ఉండగా కువెంపునగర పోలీసులు పట్టుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసు భయంతో సతమతమైన అతడు ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు, కుటుంబ సభ్యులు చూసి వెంటనే ఆసుపత్రికి తరలించగా మరణించాడని వైద్యులు ప్రకటించారు. పోలీసులు స్పందిస్తూ, గంజాయి వాడినందుకు అతనిపై కేసు నమోదు చేశాం, అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలియరాలేదు. అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అసహజ మరణంగా కేసు నమోదు చేశామని తెలిపారు.
చిరుత బాధిత
కుటుంబానికి పరిహారం
మైసూరు: చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని నాగమలేలో చిరుతపులి దాడిలో మరణించిన బాలుడు హర్షిత్ (10) కుటుంబానికి ప్రభుత్వం రూ. 20 లక్షల పరిహారం ప్రకటించింది. ఆదివారం మలే మహదేశ్వర కొండ నుంచి నాగమలేకు భక్తులు వెళ్తుండగా చిరుత దాడి చేసి బాలున్ని లాక్కెళ్లి చంపివేసింది. అటవీ శాఖ బాలుని కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం ప్రకటించి, ఇప్పటికే రూ. 5 లక్షల చెక్కును అందజేసింది. మిగిలిన సొమ్మును కుటుంబ బ్యాంకు ఖాతాకు జమచేస్తారు.


